అర్థరాత్రి 12 గంటలకు ఏం జరిగింది?


వివాదస్పద, సంచలనాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఇప్పుడు చిత్రాల జోరు పెంచారు. గత కొంతకాలంగా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ కార్యక్రమాలతో పాటు థియేటర్లు కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అయితే రాంగోపాల్‌ వర్మ మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒక దాని తర్వాత ఒకటి వరుస చిత్రాలను తెరకెక్కించి విడుదల చేస్తూ కరోనాను లెక్కచేయకుండా దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన 12 ఓ క్లాక్‌ అనే చిత్రానికి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశాడు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే ఒకింత భయపెట్టేలా ఉన్నాయి. చిత్రంలో మిధున్‌ చక్రవర్తి, మకరంద్‌ దేశ్‌పాండేలు ప్రధాన పాత్రల్లో నటించారు. అమోల్‌ రాథోడ్‌ ఫోటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం టీజర్‌ని రామ్‌ విడుదల చేస్తూ.. '12 O క్లాక్' లఘు చిత్రం కాదు. 'క్షణ క్షణం' చిత్రం తరువాత సంగీత దర్శకుడు కీరవాణి నా చిత్రానికి మ్యూజిక్ అందించారు. కీరవాణికి కూడా ఇదే మొదటి హారర్‌ చిత్రం అనుకుంటున్నా. ఈ లాక్‌డౌన్‌లో '12 O క్లాక్‌' మరింత భయపెడుతుంది'' అని ట్వీట్‌లో వెల్లడించారు. ఈమధ్యనే రామ్‌గోపాల్‌ వర్మ 'కరోనా వైరస్‌' 'క్లైమాక్స్‌', 'నేకెడ్‌', వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద రామ్‌గోపాల్‌ వర్మకు సినిమా తప్ప మరోధ్యాస ఏమీ ఉండదనీ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.