గర్జిస్తున్న అడవిబిడ్డ కొమరం భీమ్

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ‘రౌద్రం రణం రుధిరం’ (
ఆర్‌ఆర్‌ఆర్) సినిమా ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన  ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కోసం ఆశగా చూస్తున్న వారికి చిత్ర బృందం అదరగొట్టే బహుమతి ఇచ్చింది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా అన్నట్లు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పాత్రను రామ్‌చరణ్‌ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్రంలో కథానాయికలుగా ఆలియాభట్‌, ఓలివియా మోరిస్ నటిస్తుండగా అజయ్‌ దేవగణ్‌, సముద్రఖనిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈరోజు విడుదలైన రామరాజు ఫర్ భీమ్‌‌ వీడియోలో రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో..‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి. కొమురం భీమ్‌’’ అంటూ తారక్‌ పాత్రను పరిచయం చేశారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ ఆకట్టుకుంటోంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌  ఈ మధ్యే ప్రారంభం కాగా, షూటింగ్‌ మొదలైన వెంటనే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, ప్రత్యేక వీడియోను విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు వీడియోను రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని  మొదట చెప్పినా, అభిమానులను కాస్త ఉడికించి..ఊరించి 11.30గం.లకు విడుదల చేశారు. 

                   


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.