అల్లూరిని చూపించిన కొమరం భీం

రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు తారక్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ చరణ్‌ (అల్లూరి) పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేశాడు ఎన్టీఆర్‌. ఇందులో అల్లూరిగా కనిపిస్తుండగా తారక్‌ వాయిస్‌ ఇవ్వడం అందరినీ అలరిస్తోంది. ‘‘ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్యం దొర అల్లూరి సీతారామరాజు’’ అని తారక్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తి పెంచుతోంది. చెర్రీ యాక్షన్‌కు తారక్‌ స్వరం కలిసి ఆద్యంతం అద్భుతంగా నిలిచిందీ వీడియో. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చెర్రీకి జోడీగా అలియా భట్, తారక్‌ సరసన ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.