పిచ్‌ సహకరించకున్నా ‘సాహో’ మరో సెంచరీ కొట్టాడు..
‘సాహో’ బాక్సాఫీస్‌ ముందు తన జోరు చూపిస్తున్నాడు. ఇటు మీడియా అటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా వసూళ్లు మాత్రం సునామీలా పోటెత్తుతునే ఉన్నాయి. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్‌ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు మరో వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే రెండు రోజులకుగానూ ప్రపంచవ్యాప్తంగా రూ.205 కోట్ల గ్రాస్‌ దక్కినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు దక్కిన అతిపెద్ద ఓపెనింగ్‌గా ‘సాహో’ను చెప్పొచ్చు. ఓవైపు చాలా ప్రాంతాల్లో నెగిటీవ్‌ టాక్‌ లభించినప్పటికీ రెండవ రోజు ‘సాహో’కు ఎక్కడా పెద్దగా వసూళ్లు డ్రాప్‌ అయినట్లుగా కనిపించలేదు. ముఖ్యంగా దీనికి బాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈరోజుతో వీకెండ్‌ ముగియబోతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ‘సాహో’ ప్రభావం బాక్సాఫీస్‌ వద్ద ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రస్తుతం ఉన్ జోరే కొనసాగితే ‘సాహో’ భారీ నష్టాల నుంచి బయటపడటం పెద్ద విశేషమేమీ కాదు. ఎలాగూ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి పోటీగా మరే సినిమా లేకపోవడం కూడా దీనికి కలిసొచ్చే అవకాశముంది. ఇక అడ్వాన్స్‌ బుకింగ్‌ల పరంగా చూసినా ఉత్తరాదిలో ‘సాహో’కు మంగళవారం వరకు హౌస్‌ఫుల్‌ పడినట్లు తెలుస్తోంది.


ఆశ్చర్యపరుస్తున్న హిందీ వసూళ్లు..
‘సాహో’కు దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది నుంచే చక్కటి వసూళ్లు దక్కుతున్నట్లు తెలుస్తోంది. చిత్ర నెగిటీవ్‌ టాక్‌ ప్రభావం తెలుగు, తమిళ, మలయాళ భాషలపై కొంతమేర పడినప్పటికీ.. హిందీ ప్రేక్షకులు ఈ టాక్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి ఉదాహరణే ‘సాహో’ రెండో రోజు సాధించిన వసూళ్లు. ఈ చిత్రానికి తొలిరోజు బాలీవుడ్‌లో రూ.24 కోట్ల గ్రాస్‌ దక్కగా.. రెండవ రోజు రూ.23 కోట్లు కొల్లగొట్టి సినీ విశ్లేషకులను విస్మయపరిచింది. ప్రస్తుతం దీనికి హిందీలో లభిస్తున్న ఆదరణ చూస్తుంటే అక్కడ రూ.70 కోట్ల మార్కును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఏదేమైనా ‘బాహుబలి’తో ఉత్తరాదిలో ప్రభాస్‌కు విపరీతంగా క్రేజ్‌ పెరిగినట్లు ఈ కలెక్షన్లు చెప్పకనే చెబుతున్నాయి.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.