అంచనాలు పెంచేస్తోన్న ‘సాహో’ ట్రైలర్‌

‘‘గల్లీలో సిక్స్‌ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్‌ ఉంటుంది’’.. అంటూ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ట్రైలర్‌తో రంగంలోకి దిగిపోయాడు ‘సాహో’. ‘బాహుబలి’ హిట్‌ సిరీస్‌ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తోన్న చిత్రమిది. యువ దర్శకుడు సుజీత్‌ తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ నటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. దీనికి తగ్గట్లుగానే ట్రైలర్‌ ఆద్యంతం ఆ భారీ నిర్మాణ విలువలు అబ్బురపరిచాయి. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్స్‌.. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ హంగామా సినీప్రియులకు విందు భోజనం అందిస్తుందనడంలో సందేహం లేదు. ఆయనీ చిత్రంలో అండర్‌కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శ్రద్ధా.. అమృతా నాయర్‌ అనే క్రైం బ్రాంచ్‌ అధికారిణిగా సందడి చేయబోతుంది. ముంబయిలో రూ.2000 కోట్ల భారీ చోరీ జరగడం దాని వెనకున్న మాఫియాను పట్టుకునే నేపథ్యంతో సినిమా సాగబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ దోపిడీ వెనకున్న ప్రతినాయక ముఠాగా జాకీ ష్రాఫ్, అరుణ్‌ విజయ్, చుంకీ పాండే తదితర ముఠా కనిపిస్తోంది. ట్రైలర్‌ ఆద్యంతం హాలీవుడ్‌ స్థాయి పోరాట ఘట్టాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా ఛేజింగ్‌ సన్నివేశాలు ఒళ్లుగగుర్పాటుకు గురిచేస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. డార్లింగ్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో ఎంత పవర్‌ఫుల్‌గా కనిపించాడో.. లవర్‌బాయ్‌గా అంతే క్యూట్‌గా సాహోరే అనిపించాడు. ఏదేమైనా ట్రైలర్‌ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్నాయి. మరి పూర్తి స్థాయిలో ఈ వినోదాల విందును ఆరగించాలంటే ఆగస్టు 30 వరకు వేచి చూడక తప్పదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.