సందడి చేస్తోన్న ‘సవారి’ ట్రైలర్‌

నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో ‘సవారి’ అనే చిత్రం తెరకెక్కుతుంది. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్‌ పతాకంపై సంతోష్‌ మోత్కూరి, నిశాంక్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఓ గుర్రం రోడ్డుపై పరుగెడుతూ తన గురించి చెప్పుకునే సన్నివేశంతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. ‘నా పేరు బాద్‌షా. మీ ముందుకు ఓ మంచి కథ తీసుకొచ్చా’ అంటూ ఓ నటుడు గుర్రానికి వాయిస్‌ అందించారు. ఈ డైలాగ్‌ చెప్పిన వెంటనే ఆ కథలో భాగమవుతారు నందు, ప్రియాంక శర్మ. దేవుడా నన్ను తీసుకెళ్లిపో. ఈ పాడు సమాజంలో నేను బతకలేనంటూ ఏడుస్తుంటుంది కథానాయిక. ఆమెకు నచ్చని పెళ్లి చేస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తుంటే. ప్రియాంకతో ప్రేమ, గుర్రంతో ఉన్న అనుబంధం ఈ రెండింటి మధ్య నలిగిన రాజు కథే ‘సవారి’. రాజు ఏం చేశాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ కథను తెరపై చూడాలంటే మా సినిమాకు రావాలని మనవి అంటూ ముగించడం ఆకట్టుకుంటుంది. శేఖర్‌ చంద్ర నేపథ్య సంగీతం అలరిస్తుంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.