‘సీత’.. ఇది ఈ తరం రామాయణం

‘‘నా పేరు సీత.. నేను గీసిందే గీత’’ అంటోంది కాజల్‌ అగర్వాల్‌. ఆమె తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జంటగా నటించిన చిత్రం ‘సీత’. మన్నారా మరో కథానాయికగా నటిస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి హిట్‌ తర్వాత దర్శకుడు తేజ - కాజల్‌ల కలయికలో వస్తోన్న చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కాజల్‌ పాత్ర చాలా సరికొత్తగా కనిపిస్తోంది. ముక్కుసూటితనం, పొగరు కలగలిసి ఉన్న వ్యక్తిత్వం సీత పాత్రలో కనిపించగా.. అమాయకుడైన రాముడు పాత్రలో సాయి శ్రీనివాస్‌ కనిపించారు. ఇక తన మనసుకు నచ్చిన దాని కోసం ఎంతకైనా తెగించే రావణాసురుడుగా (విలన్‌) సోనూసూద్‌ దర్శనమిచ్చారు. ట్రైలర్‌ను కట్‌ చేసిన విధానం, అందులోని ముగ్గురు పాత్రలను పరిచయం చేసిన తీరు ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా కాలం తర్వాత తనికెళ్ల భరణికి ఓ వైవిధ్యమైన పాత్ర దొరికింది. ‘‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’’ అని చివర్లో బెల్లంకొండ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ట్రైలర్‌ను బట్టీ చూస్తుంటే.. తేజ ఈ సినిమాతో నేటి తరానికి సరిపోయే ఓ సరికొత్త రామాయణాన్ని చూపించబోతున్నారు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.