ఆకట్టుకుంటున్న సుశాంత్‌ సింగ్‌ ‘దిల్‌ బెచారా’ ట్రైలర్‌బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం 'దిల్‌ బెచారా'. ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. ట్రైలర్లో సుశాంత్‌ సింగ్‌, కొత్త నటి సంజన సంఘీల నటన హృదయాన్ని తట్టిలేపేలా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే కంటతడి పెట్టించేలా ఉంది. 2014లో హాలీవుడ్‌లో విడుదలైన రొమాంటిక్‌ డ్రామా 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌' చిత్రానికి ఈ సినిమా రిమేక్‌గా ‘దిల్‌ బెచారా’ నిర్మితమైంది. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథ ఇది. ఇందులో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించాడు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. మే నెలలోనే విడుదల కావాల్సిన ‘దిల్‌ బెచారా’ చిత్రం కరోనా వైరస్‌ - లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈనెల 24వ తేదీన హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్‌ విడుదల సందర్భంగా సినిమా డైరెక్టర్‌ ముకేష్‌ చబ్బా మాట్లాడుతూ..‘‘మా రెండేళ్ల నిరీక్షణ అనంతరం సినిమాని విడుదల చేస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. హృదయానికి దగ్గరైన స్నేహబంధం లభించింది. నా చివరి శ్వాస వరకు నాతోపాటు ఉండే సుశాంత్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘దిల్‌ బెచారా’ విడుదలకు సిద్ధమైందని’’న్నారు. ట్రైలర్‌ని ట్విటర్‌లో పంచుకున్నకథానాయిక సంజన స్పందిస్తూ.. ‘'సుశాంత్‌.. మేమంతా నిన్నెంతో మిస్‌ అవుతున్నాం. నువ్వు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు’’ అంటూ పేర్కొంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించిన తరువాత విడుదల అవుతున్న చిత్రం ఇదే.  24 గంటలు కూడా గడవక ముందే ట్రైలర్‌ 20 మిలియన్ వ్యూస్ దాటేసింది. అలాగే ఈ ట్రైలర్ కి 4.2 మిలియన్ లైక్స్ రావడం మరో రికార్డ్. 

                            Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.