చంపెయ్‌ అమ్మా.. చంపెయ్‌!!

పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్‌.ఎన్‌ సూర్య తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణసుందరి’. టీం పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.వి.కె రెడ్డి సమర్పిస్తున్నారు. లక్ష్మీ నిర్మాత. మే 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ విగ్రహం చుట్టూ అల్లుకున్న కథ ఇది. 600 ఏళ్ల కిత్రం ఓ రాజు చేసిన తప్పు.. ఇప్పటివరకు వచ్చిన తరాలను ఎలా వెంటాడుతోంది, వారినెలా బాధ్యులుగా మార్చిందన్న నేపథ్యంతో సాగుతుంది. ఓ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. దీని నుంచి వినోదం ఆశించవద్దు. కానీ, తొలి సీన్‌ నుంచి చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. సినిమాలో ఎవరిదీ అతిథి పాత్ర కాదు. ప్రతి పాత్రకు ప్రాధాన్యముంది. కథ డిమాండ్‌ చేయడం వల్లే బడ్జెట్‌ ఎక్కువైంది. అరుంధతి, బాహుబలి చిత్రాల స్థాయిలో గ్రాఫిక్స్‌ కనువిందు చేయనుంది’’ అన్నారు. ‘‘అనుకున్న దానికైనా బడ్జెట్‌ ఎక్కువైనా.. అవుట్‌పుట్‌ చూశాక చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 31న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి. ఛాయాగ్రాహకుడు ఈశ్వర్‌ మాట్లాడుతూ ‘‘మా చిత్రంతో ఈ వేసవిలో మంచి గ్రాఫిక్స్‌ విజువల్‌ ట్రీట్‌ అందించబోతున్నాం. సినిమాకిదే ప్రధాన బలం. ఆలస్యమైనా నాణ్యమైన అవుట్‌పుట్‌ అందించామ’’న్నారు. కోట శ్రీనివాస్, నాగినీడు, సత్యప్రకాష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సాయి కార్తిక్‌ స్వరాలు సమకూర్చారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.