అంచనాలు పెంచేలా ‘జాంబిరెడ్డి’ టీజర్‌

‘అ!’, ‘కల్కి’ వంటి వైవిధ్య భరిత చిత్రాల తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాంబిరెడ్డి’. జాంబి నేపథ్యంలో తెలుగులో రూపొందిన తొలి చిత్రమిదే. తేజ సజ్జ, ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ నాయిక సమంత విడుదల చేశారు. ‘ఫస్ట్‌ బైట్‌’ పేరుతో వచ్చిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. విజులవ్‌ ఎఫెక్ట్స్‌, నేపథ్య సంగీతం మరో స్థాయిలో నిలిచాయి. ‘దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం.. రాక్షస మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం. భగవంతుని సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేథాశక్తి ఇవ్వడం. ఆ మేథాశక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే? దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం’ అనే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. నాయిక ఆనంది ఏదో ప్రమాదంలో ఉంటే కథానాయకుడు తేజ కాపాడే సన్నివేశం అదరగొడుతుంది. కరోనా వైరస్‌ కథాంశంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందీ చిత్రం. ఇప్పటికే పోస్టర్లు, కాన్సెప్టులతో ఆసక్తిని పెంచిన చిత్ర బృందం టీజర్‌తో భారీ అంచనాలు పెంచుతుంది. మానవ తప్పిదం వల్లే కరోనా వచ్చిందా? దానికి పరిష్కారం ఏం చేశారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌ శేఖర్‌ వర్మ నిర్మిస్తున్నారు. మార్క్‌ కే రాబిన్‌ సంగీతం అందించారు.ఛాయాగ్రహణం: అనిత్‌, ఎడిటర్‌:సాయి బాబు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.