అక్కినేని కోపం... అంతా గప్‌చుప్‌!

సినిమా నటుల్లో తక్కినవాళ్లకి క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలో చెప్పి, తాము అవలంబించి చూపించిన వారు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. సినిమా షూటింగ్‌కి టైమ్‌కి రావడం, నిర్మాతతో సహకరించడం, పనిమీద శ్రద్ధ వంటివన్నీ ఆ నాయక పాత్రధారుల దగ్గర నేర్చుకున్నవే. ‘శ్రీమంతుడు’ (1971) సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ సారధి స్టూడియోలో జరుగుతోంది. హీరో అక్కినేని. ఆయన తప్ప తక్కిన వాళ్లంతా మద్రాసు నుంచి హైదరాబాద్‌ వచ్చినవాళ్లే. నాగేశ్వరరావు తనకి షూటింగ్‌ వుంటే, ఉదయం 8 గంటలకల్లా స్టూడియోకి వచ్చి, మేకప్‌ చేసుకొని దుస్తులు వేసుకొని 9 గంటలకల్లా సిద్ధంగా ఉంటారు - కాల్‌షీటు వేళ. ఒక రోజు, పెద్ద సెట్లో షూటింగ్‌. లాంగ్‌ షాటు. అంటే ఫైటింగ్‌కి, గంట సేపయినా పడుతుంది. ఆరోజు షూటింగ్‌లో, సూర్యకాంతం, రమణారెడ్డి, నేను, సాక్షి రంగారావు, గుమ్మడి - ఉన్నాం. లైటింగ్‌ అయ్యేవరకు టైముపడుతుంది కదా, సూర్యకాంతం పేకలు తీశారు. డైనింగు టేబులు, కుర్చీలూ ఉన్నాయి. అందర్నీ ‘రండిరండి’ అంటూ ఆహ్వానించారు. అందరూ మేకప్‌తో సిద్ధంగానే ఉన్నారు. నాకు పెద్దగా ఆటరాదు. అయినా నన్నూ కూచోమన్నారు. దర్శకుడు ప్రత్యాగాత్మ కూడా ఆటలో పాల్గొన్నారు. మేకప్‌ రూములో సిద్ధమై కూచున్న హీరోకి సెట్టుకి రమ్మని పిలుపు రాలేదు. 9-15 అయింది, 9-30 అయ్యింది, 9-45 అయింది. ఇంక ఆయన ఉండబట్టలేక సెట్టుకి వచ్చేశారు. లైటింగ్‌ అవుతోందని, టైమ్‌ పడుతోందనీ అక్కినేనికి కబురు చెయ్యలేదు. చేస్తే, ఆయన ఏంపని చూసుకునేవారో! ఆయన వచ్చేసరికి ఏముంది! ముమ్మరంగా సాగుతోంది ఆట. అంతే ఆయనకి మండిపోయింది - ‘‘ఏమిటిది? ఈ పేకాటకా వచ్చాం.. కాల్షీటు టైములో, సెట్లో కూచుని పేకాటా?’’ అని అరిచారు. ‘‘లైటింగ్‌ అవుతోంది... లాంగ్‌ షాటు’’ అని, ప్రత్యాగాత్మ చెప్పారు. ‘‘అయితే? రిహార్సల్సు చూసుకోవచ్చు కదా. ఒకసారి దృశ్యం ఏమిటో తెలుసుకుని, పొజిషన్స్‌ చూసుకోవచ్చు కదా.. నిర్మాత ఏమైపోతాడు? ఎందుకిలా టైమ్‌ వేస్టు చేస్తున్నారు..? వృత్తి మీద ఎవరికీ శ్రద్ధ లేదు.. గౌరవం లేదు.. దేనికొచ్చాం.. దేనికి నిర్మాత దగ్గర్నుంచి డబ్బు తీసుకుంటున్నాం..’’ అంటూ, తారాస్థాయిలో అందర్నీ ఝాడించెయ్యడం మొదలు పెట్టేసరికి - పేకలు పారేసి, ఎక్కడవాళ్లు అక్కడ ఉండకుండా మూల మూలకీ పారిపోయారు. ఎవరూ నోరెత్తలేదు. తలలు దించుకొని నిలబడిపోయారు. ఆవేశాన్ని అణచుకొని అక్కినేని కుర్చీలో కూలబడ్డారు. ‘‘సీన్‌ చూదాం రండి’’ అని ప్రత్యాగాత్మ అందర్నీ పిలిచి, రిహార్సల్సు ఆరంభించగానే చీవాట్లు పెట్టిన అక్కినేని నవ్వుతూ వచ్చి, సీన్‌లో పాల్గొన్నారు. (చెప్పకేం - ఆనాటి నుంచి, నేను ఎప్పుడూ షూటింగ్‌లో పేక ముట్టుకోలేదు)


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.