ఆత్రేయ పాటకు సెన్సార్ కట్

జగపతి రాజేంద్రప్రసాద్ 1965లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో ‘అంతస్తులు’ సినిమా నిర్మించారు. మే 27న విడుదలయింది. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ కాగా పాటల రచయిత ఆచార్య ఆత్రేయ. అందులో ‘తెల్లచీర కట్టుకున్నదెవరికోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారిలమీద చిత్రీకరించబడిన యుగళ గీతమొకటి వుంది. నాయకుడు సంధించే ప్రశ్నలకు నాయిక సమాధానమిస్తూ నటించిన శృంగార గీతమిది.పాత పల్లవిలో నాయకుడు ‘తెల్లచీర కట్టుకున్నదెవరికోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము’ అని అడిగితే... నాయిక ‘తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా కల్లకపటమెరుగని మనసు కోసము... మనసులోని చల్లని మమతకోసము’ అంటూ బదులిస్తుంది.ఈ పాటలో మొత్తం మూడు చరణాలున్నాయి.

తొలి చరణంలో నాయకుడు ‘దాచుకున్న మమతలన్ని ఎవరికోసము’ అని అడిగితే నాయిక ‘దాపరికం ఎరుగని మనిషి కోసము’ అంటూ బదులిస్తుంది. వెంటనే నాయకుడు ‘దాగని యవ్వనం ఎవరికోసము’ అని ప్రశ్నిస్తాడు. అందుకు నాయిక ‘దాచుకొని ఏలుకొనే ప్రియుని కోసము’ అని జవాబిస్తుంది.
ఇంతవరకు బాగానే వుంది. రెండవ చరణం లోకి వచ్చేసరికి నాయకుడు ‘అద్దాలచెక్కిళ్లు యెవరికోసము’ అని అడుగుతాడు. అందుకు నాయిక ‘ముద్దైన నీ మోవి ముద్రకోసము’ అని బదులిస్తుంది. ఈ చరణానికి సెన్సారు వాళ్ళు ఇక్కడే బ్రేక్ వేశారు. అప్పట్లో ‘తెరపై ముద్దు’ మీద నిషేధం వుంది. నాయిక తన పెదవులమీద నాయకుడు ముద్రించే ముద్దుకోసం అంటూ బదులివ్వడం సెన్సారు వారికి ప్రతిబంధకంగా అనిపించింది. ఈ చరణం పొడిగింపుగా ఆత్రేయ ‘పొద్దంత కలవరింత ఎవరి కోసము’ అంటుంటే నాయిక ‘నిద్దురైనరానీని నీకోసము’ అని బదులిస్తుంది. వీటిని మాత్రమే వుండనిచ్చి *‘అద్దాలచెక్కిళ్లు యెవరికోసము’*; *‘ముద్దైన నీ మోవి ముద్రకోసము’* వాక్యాలను పాటనుండి పూర్తిగా తొలగించారు.


ఈ వాక్యాలు గ్రామఫోను రికార్డులోకి కూడా రానీయకుండా వుండాలని హెచ్చరిస్తే నిర్మాత జాగ్రత్తగా ఆ రెండు వాక్యాలను రికార్డు మీదనుంచి తొలగించారు. సినిమాలో పాటను జాగ్రత్తగా గమనిస్తే ఈ చరణం కత్తిరింపుకు గురైన ఆనవాలు తెలిసిపోతుంది. ఆరోజుల్లో కనుక సెన్సారు వాళ్ళు అంతటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నవతరం సినిమాలలో వచ్చే పాటల, మాటల సరళి మీరు చూస్తూనే వున్నారుగా! కత్తెర వెయ్యాలంటే ఫిలిమ్ మిగలదు. అందుకే కామోసు ఈరోజుల్లో సినిమాలన్నీ డిజిటల్ సాంకేతికతో నిర్మిస్తున్నారు.... ముడి ఫిలిమ్ అవసరం లేకుండా!!


Also Read : తెలుగుజాతి యుగపురుషుడు...తారక రాముడు

ఆచారం షణ్ముఖాచారి
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.