ఆమె వద్దంటేనే అనుష్క ‘అరుంధతి’గా మారింది

‘అరుంధతి’ అంటే అనుష్క, అనుష్క అంటే ‘అరుంధతి’ గుర్తుకొస్తుంది కదా. అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది ఆ సినిమా. అనుష్క కోసమే ఆ పాత్ర పుట్టుకొచ్చిందా? అనే సందేహం కలగకమానదు. ఈ ఒక్క సినిమా అటు కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు స్ఫూర్తినిచ్చింది. ఇటు ప్రేక్షకులకు సరికొత్త గ్రాఫిక్స్‌ విజువల్స్‌ను పరిచయం చేసింది. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఇందుకు అనుష్క నటనే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కథకు తగ్గట్లు రాజసం ఉట్టిపడే పాత్ర పోషించి ఈమె తప్ప మరెవరూ చేయలేరు అనిపించుకుంది. ఇంతటి అవకాశం అనుష్కకు రావడానికి కారణం పరోక్షంగా మరో కథానాయికే. ఎవరు? ఎందుకు అంటారా? ‘యమదొంగ’ ఫేం మమతా మోహన్‌దాస్‌. చిత్ర బృందం కథను సిద్ధం చేసుకుని తారాగణం కోసం అన్వేషించి, మమతను ఎంపిక చేసిందట. అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండేది. అయినా ఈ చిత్రంలో నటించేందుకు సుముఖంగా ఉన్న ఆమెను ఎవరో నటించొద్దని చెప్పారట. అలాంటి సినిమాలు పూర్తవడానికి చాలా సమయం పడుతుంది, ఆ గ్యాప్‌లో రెండు, మూడు చిత్రాల్లో నటించొచ్చు అని చెప్పడంతో మమత మనసు మార్చుకుని ‘అరుంధతి’ని తిరస్కరించిందట. దీంతో మళ్లీ ఆరగడుగుల కథానాయిక కోసం వెతికే పనిలో అనుష్కను సంప్రదించిందట చిత్ర బృందం. కథ వినగానే ఓకే చెప్పిందట అనుష్క. ఆ తర్వాత ఎంతటి పేరు సంపాదించిందో తెలిసిందే కదా. అలా మమత తిరస్కరించిన ‘అరుంధతి’ అనుష్కగా మారింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.