వెయ్యి మందిని చంపి.. తన పాత్రలో తానే నటించి
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో గొప్ప గొప్ప జీవితగాథలు వెండితెరపై సందడి చేశాయి. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు.. రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల వరకు.. తెరపై వెలిగిన జీవితాల నుంచి తెర వెనుక దాగిన ఎన్నో స్ఫూర్తిదాయక కథల వరకు సినీప్రియులకు వినోదాన్ని పంచాయి. కానీ, వెయ్యి మందిని చంపిన ఓ నర హంతకుడి జీవిత కథను.. అతని నట సారథ్యంలోనే ఎప్పుడైనా చూశారా? అసలలాంటి ఆలోచనతో, ఎంతో సాహసానికి సిద్ధపడి సినిమా చెయ్యొచ్చని ఎవరైనా ఊహిస్తారా? ఈ అద్భుత ఘట్టాన్నే వెండితెరపై ఆవిష్కరించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు దర్శకుడు జాషువా ఓపెన్హీమర్‌. ‘యాక్ట్‌ ఆఫ్‌ కిల్లింగ్‌’ పేరుతో ఆయన తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో తన నిజ జీవిత పాత్రను తానే చేసిన ఆ భీకర నటుడు అన్వర్‌ కాంగో. 2012లో ఆస్కార్‌ పురస్కారాలకు నామినేట్‌ అయిన ఈ అద్భుత డాక్యుమెంటరీ గురించి ఇటీవలే ప్రఖ్యాత బీబీసీ ఛానెల్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో ప్రస్తావించిన పలు ఆసక్తికర విశేషాలు ఇవి..


‘ద యాక్ట్‌ ఆఫ్‌ కిల్లింగ్‌’ అనే ఈ డాక్యుమెంటరీలో 20 శతాబ్దంలో బయట ప్రపంచానికి తెలియని అనేక ఊచకోతలు చూపించారు. ఈ ఊచ కోతల్లో ప్రధాన భూమిక వహించిన అన్వర్‌ కాంగో జీవితాధారంగా దీన్ని రూపొందించారు. మరో విశేషమేంటంటే.. ఈ కథలో తన నిజ జీవిత పాత్రను తానే పోషించి అన్ని వందల మందిని ఎలా చంపింది కెమెరాల ముందు చేసి చూపించారు అన్వర్‌. 1965 నుంచి 1966 వరకు ఇండోనేషియాలో జరిగిన ‘రాజకీయ ప్రక్షాళన’ సమయంలో దాదాపు ఐదు లక్షల మందికి పైగా హత్యకు గురయ్యారు. ఆ సమయంలో తమ అధికారానికి ఎదురు తిరుగుతున్నారనే నేపంతో నాటి సైన్యం.. కమ్యునిష్టులని అనుమానం వచ్చిన ఎవరినైనా నిశ్శబ్దంగా మట్టుపెట్టేసే ఉద్యమానికి తెరలేపింది. ఇందులో భాగంగా ఇండోనేషియా సైన్యం రైట్‌ వింగ్‌ పారామిలటరీ, నేరగాళ్ల ముఠాలతో కలిపి ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. అలా ఏర్పడిన వాటిలో ‘ఫ్రాగ్‌ స్క్వాడ్‌’ (కప్ప దళం)కు చెందిన వాడే ఈ అన్వర్‌ కాంగో. అప్పటికి ఉన్న దళాల్లో ఇదే అత్యంత కిరాతమైన హంతక ముఠా. ఈ ఊచకోతల్లో అన్వర్‌ కాంగో కీలక పాత్ర పోషించారు. అనుమానిత కమ్యునిష్టులను చంపడమే అతని విధి. ఇందులో భాగంగానే తాను దాదాపు 1000 మంది వరకు హత్య చేసినట్లు ఆ డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చాడు అన్వర్‌. అంతేకాదు వాళ్లను ఎక్కువగా ఎలా హతమార్చేది అందులో చేసి చూపించాడు. ‘‘గొంతకు వైరు బిగించి, ఊరిరాడకుండా చేసి చంపడం నాకు ఇష్టమైన పద్ధతి. కొట్టి చంపితే అనవసర గందరగోళం, శ్రమ ఎక్కువ. అందుకే ఈ దారిని ఎంచుకున్నా’’ ఇది ఆ డాక్యుమెంటరీలో అన్వర్‌ చెప్పిన ఓ వివరణ. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. అతనెంతటి దారుణాలకు ఒడిగట్టాడన్నది చెప్పడానికి. ఇక్కడ మరో ఆసక్తికర విశేషం ఏంటంటే.. అతను ఈ హత్యలన్నింటినీ హాలీవుడ్‌ చిత్రాల స్ఫూర్తితోనే చేశాడట. ముఖ్యంగా అల్‌ పాచినో, జాన్‌ వేన్‌ నటించిన మాఫియా సినిమాల్లోని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకోని ఆ రీతిలో హత్యలకు పాల్పడేవాడట. ఇది ఎలాగూ ప్రభుత్వ కనుసనల్లో గుట్టుగా సాగిపోయిన తంతు కావడంతో అన్వర్‌ నేరాలపై ఎప్పుడూ ఏ చర్యలు తీసుకోలేదు. అప్పట్లో అతని పేరు వినబడితేనే జనాలు వణికిపోయేవారట. అయితే ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయానికొచ్చే సరికి అన్వర్‌లో తాను చేసిన పాపాలకు పశ్చాత్తాప భావం మొదలైందట. ఇందులో ఆయన చివర్లో ఓ బాధితుడిగా నటించారట. ఆ సీన్‌లో అన్వర్‌ మెడ చుట్టూ ఓ వ్యక్తి వైరు బిగిస్తుంటే తట్టుకోలేక చిత్రీకరణ ఆపేయమన్నాడట. కాసేపు ఓ పక్కకు వెళ్లి చలనం లేకుండా మౌనంగా కూర్చున్నాడట. ‘‘నేను పాపం చేశానా? ఎంతో మందికి నేనలా చేశా’’ అంటూ ఆ సీన్‌ చేస్తూ కన్నీళ్లు పెట్టకున్నాడట అన్వర్‌. ఇతను 2018 అక్టోబరు 25న కన్నుమూశారు. ఈ డాక్యుమెంటరీ ఇండోనేషియన్లపై అక్కడ కమ్యునిష్టులను చూసే విధానంపై గొప్ప ప్రభావం చూపించింది. దీనిపై అధికారికంగా అక్కడ నిషేధం ఉన్నా.. రహస్య ప్రదర్శనలు జరిగాయి. తర్వాత ఇదే హత్యోదంతాలపై బాధితుల కోణంలో ‘ద లుక్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ అనే మరో చిత్రం కూడా వచ్చింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.