బాలచందర్‌ నిజాయితీ

మద్రాసులో నేను ఆంధ్ర ఆర్ట్స్‌ సంస్థ స్థాపించి నాటకాలు వేస్తున్న సమయంలో ‘పట్టాలు తప్పిన బండి’ నాటకం రాసి ప్రదర్శించాము - 1964లో. ఆ ప్రదర్శనకి పెద్దలందరూ చాలా మంది వచ్చారు. (టిక్కట్లు కొని, అంటే మేము వెళ్లి అమ్మగా, 10 రూపాయలకి 5 టిక్కెట్లు) పి.పుల్లయ్య, బి.ఎన్‌.రెడ్డి, షావుకారు జానకి, ఆరుద్ర, కమలాకర కామేశ్వరరావు, గుమ్మడి వంటి ప్రముఖలు నాటకం కాగానే రంగస్థలం మీదికి వచ్చి మమ్మల్ని ఆభినందించారు. ఆది మొదటి ప్రదర్శన. ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీలుకి (1965: హైదరాబాద్‌) వెళ్లే ముందు మళ్లీ ప్రదిర్శించనప్పుడు షావుకారు జానకి కె.బాలచందర్‌ని, వారి నాటక బృందాన్ని తీసుకొచ్చారు. జానకి - బాలచందర్‌ నాటకాల్లో నటించేవారు. సినిమా నటిగా ప్రసిద్ధి పొందినా, అప్పుడు బాలచందర్‌ ఇంకో నాటకం రాయబోతున్నారు. ఆయనకి ‘పట్టాలు తప్పిన బండి’ నచ్చినా- తమళంలోకి తీసుకోలేదు గాని- నాటకంలో వున్న లక్ష్మిపతి అనే పాత్రని తీసుకుని తన కొత్త నాటకంలో వాడారుట. ఆ నాటకం ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వలేదు. ఆ నాటక ప్రదర్శన రెండు రోజులుందనగా ఆయన ‘విజయచిత్ర’ ఆఫీసుకి వచ్చి (1966) ఆ విషయం చెప్పారు. ‘‘మీ నాటకంలో పక్కింటివాడు వచ్చి, అదే పనిగా టెలిఫోన్లు చేసి పోతూవుంటాడు. అలాంటి పాత్రని నేను తీసుకుని నా నాటకంలో పెట్టాను. స్ఫూర్తి పొందాను గాని, పూర్తిగా అలాగే తీసుకోలేదు. నాగేష్‌ ఈ వేషం వేస్తున్నాడు. ఆ నాటకం తొలి ప్రదర్శన ఎల్లుండి ఆదివారం ఆర్‌.ఆర్‌.సభలో వుంది. మీరూ, మీ భార్యా ఇద్దరూ తప్పకుండా రావాలి. ఇదిగో అని రెండు మొదటి సీట్ల టిక్కట్లు ఇచ్చారు. ‘‘సారీ- మీకు చెప్పకుండా, మీ పాత్రని వాడినందుకు. తప్పకుండా వచ్చి నాటకం చూడండి’’ అని వెళ్లారాయన! అప్పటికే ఆయన పేరు మోసిన సినిమా రచయిత, దర్శకుడూ! ఆయన పని గట్టుకుని- నాలాంటివాడి దగ్గరకొచ్చి, ఆ మాటచెప్పి నాటకానికి ఆహ్వానించడమా! ‘‘ఎంతటి నిజాయితీ!’’ ‘‘ఏమి కృతజ్ఞత!’’ అనిపించి- ఆనందబాష్పాలు రాల్చాను. (బాలచందర్‌ దర్శకత్వంలో నేను ‘భలేకోడళు’్ల, ‘సత్తెకాలపు సత్తెయ్య’, ‘మానం కోసం’ మొదలైన సినిమాల్లో నటించాను. ‘మానంకోసం’లో రజనికాంత్‌ ద్విపాత్రాభియం చేసే ఏకపాత్ర ధరించారు. హిందీ ‘గోల్‌ మాల్‌’ ఈ సినిమాకి ఆధారం. అయితే, దురదృష్టవశాత్తు- సినిమా తొలికాపీ వచ్చినా- విడుదల కాలేదు. ‘ఆకలిరాజ్యం’ సినిమాని బాలచందర్‌ హిందీలో తీస్తే- అందులో ఓ వేషం వేశాను)

- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.