‘దీన’ భగవాన్‌ దాదా మీకు తెలుసా

ముంబై నగరంలోని జూహు అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ప్రాంతం. పలుకుబడి కలిగిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు నివసించే ప్రాంతమది. అందులో 25 బెడ్‌ రూములతో, నీటి కొలను, ఫౌంటైన్‌లతో పెద్ద బంగాళా వుండేది. దాని యజమాని అలనాటి బాలీవుడ్‌ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాతగా పేరెన్నికగల భగవాన్‌ దాదా. ఆ బంగాళాలో భగవాన్‌కు ఏడు విలాసవంతమైన చవర్లేట్‌ విదేశీ కార్లు వుండేవి. రోజుకు ఒక కారును మాత్రమే భగవాన్‌ వాడేవాడు. ఆయన అసలు పేరు భగవాన్‌ ఆబాజీ పాలవ్‌. 1951లో భగవాన్‌ నిర్మాణ దర్శకత్వంలో ‘అల్బేలా’ అనే మ్యూజికల్‌ కామెడీ చిత్రం విడుదలైంది. ఆ చిత్రానికి దర్శకుడే కాదు, రచన, చిత్రానువాదం కూడా భగవానే. రామచంద్ర చితాల్కర్‌ సంగీత దర్శకత్వం వహించిన ‘అల్బేలా’ బాక్సాఫీస్‌ హిట్టయింది. అందులో భగవాన్‌ దాదా, గీతాబాలి హీరో హీరోయిన్లు. ‘’షోలా జో బడ్కే దిల్‌ మేరా దడ్కే’’, ‘’షామ్‌ డలే కిడకీ తలే తుమ్‌ సీటీ బజానా ఛోడ్‌ దో’’ వంటి పాటలు నాటి ప్రేక్షకులను అలరించాయి. ఆరోజుల్లోనే ఈ చిత్రంలోని పాటలకు బ్యాంగో డ్రమ్ములు, క్లార్నెట్, సెక్సాఫోను, ట్రంపెట్ల వంటి పాశ్చాత్య సంగీత పరికరాలను వాడి హిట్‌ చేశారు. ప్రతి వివాహ కార్యక్రమంలో గాని, దాండియా సంబరాలలోగానీ ‘అల్బేలా’లోని పాటలు తప్పకుండా వినిపించేవి. భగవాన్‌ స్లో మూవ్మెంట్‌తో చేసే డ్యాన్స్‌ పద్ధతిని అమితాబ్‌ బచ్చన్, రిషికపూర్, మిథున్‌ చక్రవర్తి వంటి నటులు అనుకరించడం గొప్ప విషయం. ‘అల్బేలా’ చిత్రాన్ని తదనంతరం ‘నల్ల పిల్లై’ పేరుతో తమిళంలోకి డబ్‌ కూడా చేశారు. అంతేకాదు, ‘వనమోహిని’ (1941) అనే తమిళ సినిమాకు కథ సమకూర్చి దర్శకత్వం వహించి భగవాన్‌ సూపర్‌ హిట్‌ చేశారు. భగవాన్‌ మరణానతరం ‘అల్బేలా’ సినిమా ప్రేరణతో ‘ఏక్క్‌ అల్బేలా’ పేరుతో మరాఠీలో భగవాన్‌ బయోపిక్‌ నిర్మాణం కూడా జరిగింది. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భగవాన్‌ దాదా స్నేహం కోసం ఓంప్రకాశ్, రాజేంద్ర కృషన్‌ వంటి సెలెబ్రిటీలు కూడా పడిగాపులు కాచేవారు. అలాంటి భగవాన్‌ దాదా చివరి రోజుల్లో ఒక సత్రంలో కుటుంబంతోబాటు తలదాచుకోవలసి వచ్చింది. 2002లో అదే సత్రంలో హృద్రోగంతో దాదా మరణించాడు.

1913లో భగవాన్‌ బొంబాయిలో జన్మించాడు. తండ్రి బొంబాయిలోని వస్త్ర ఊత్పత్తి మిల్లులో పనిచేసేవాడు. భగవాన్‌కు సినిమాల మీద మోజు వుండేది. ‘క్రిమినల్‌’ వంటి కొన్ని మూకీ చిత్రాల్లో భగవాన్‌ నటించాడు. స్టూడియోలో పనిచేస్తూ సినిమా నిర్మాణానికి సంబంధించిన 24 క్రాఫ్టుల్లో అనుభవం సంపాదించి, కేవలం యాభై వేల రూపాయల బడ్జెట్‌లో సినిమాలు నిర్మించి ‘బి’ క్లాస్‌ సెంటర్లలో విడుదల చేసేవాడు. 1938లో భగవాన్‌ ‘బహదూర్‌ కిసాన్‌’ అనే సినిమాకు సహదర్శకుడిగా పనిచేశాడు. ఒకానొక షూటింగులో లలితా పవార్‌ను భగవాన్‌ దాదా చెంపమీద కొట్టాల్సి వచ్చింది. పొరపాటున అతని చెయ్యి బలంగా లలితా పవార్‌ కంటిని తాకింది. దాంతో ఆమెకు పాక్షిక పక్షవాతం వచ్చింది. ఎడమకన్ను చూపు కోల్పోయింది. 1942లో భగవాన్‌ చెంబూరులో కొంత స్థలం కొని జాగృతి స్టూడియో కట్టాడు. ‘అల్బేలా’ చిత్రం అందులోనే తయారైంది. ‘అల్బేలా’ చిత్రం తరువాత ‘ఝమెలా’ (1953), ‘భాగం భాగ్‌’ (1956) చిత్రాలు నిర్మించాడు. అవి అంతగా విజయవంతం కాలేదు. సినిమాలు విజయవంతం కాకపోవడంతో భగవాన్‌ ఆప్పులబారిన పడ్డాడు. దాంతో ఆస్తులు అమ్ముకొని సత్రంలో మకాం పెట్టాల్సి వచ్చింది. చివర్లో దిలీప్‌ కుమార్‌ వంటి నటులు కాస్త ఆర్ధిక సహాయం అందించినా కుటుంబం పెద్దది కావడంతో సత్రంలోనే వుంటూ అత్యంత దీనస్థితిలో భగవాన్‌ దాదా కన్నుమూశాడు. హాలీవుడ్‌ ఫిలిమ్‌ నటుడు డగ్లస్‌ ఫెయిర్‌ బాంక్స్‌ అంటే భగవాన్‌కు చాలా అభిమానం. అతడిలాగే భగవాన్‌ స్టంట్లు చేసేవాడు. రాజకపూర్‌ భగవాన్‌ స్టంట్లు చూసి అతనికి ‘ఇండియన్‌ డగ్లస్‌’ అనే పేరు కూడా పెట్టారు. అందుకేనేమో భర్తృహరి అన్నారు ‘’పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్‌’’ అని. వివేక భ్రష్టులైన వారి పతనం ఆరంభమైతే పాతాళానికి వెళ్ళేదాకా ఆ పతనం ఆగదు!


- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.