బి.ఎన్‌.రెడ్డి ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి!

60 సంవత్సరాల  ‘రాజమకుటం’ (ఫిబ్రవరి 24, 1960) గురించి... 
ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎన్‌.రెడ్డి వాహినీ బ్యానర్‌ మీద 1955లో ‘సైలాస్‌ మార్నర్‌’ నవల ఆధారంగా ‘బంగారుపాప’ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకి మంచిపేరు, అవార్డు అయితే వచ్చాయి... కానీ ఆర్ధిక విజయం సాధించలేదు. కొందరు శ్రేయోభిలాషులు ఏదైనా డబ్బులు వచ్చే సినిమా తీయమని సలహా ఇచ్చారు. దాంతో డి.వి.నరసరాజును పిలిపించి ఒక జానపద చిత్ర కథ రూపొందించమని బి.ఎన్‌.రెడ్డి సూచించారు. నరసరాజు ‘రాజమకుటం’ చిత్రకథను, సన్నివేశాలను రూపొందించి, సంభాషణలు రాశారు. బి.ఎన్‌.రెడ్డి, పాలగుమ్మి పద్మరాజు, బి.ఎస్‌.రామయ్య కూర్చుని సినిమా రూపకం తయారుచేశారు. అందులో హీరో ముసుగువేషంలో వచ్చి విలన్‌ మనుషులతో తలపడతాడు. అతడికి ‘నల్లత్రాచు’ అని మారుపేరు పెట్టారు నరసరాజు. సినిమా టైటిల్‌ కూడా ‘నల్లత్రాచు’ అని పెడదామని బి.ఎన్‌.రెడ్డికి నరసరాజు సూచించారు. కానీ బి.ఎన్‌.రెడ్డి కొందరు జ్యోతిష్కుల సూచన మేరకు ‘రాజమకుటం’ అనే టైటిల్‌ని ఖాయం చేశారు. ‘రాజమకుటం’ అంటే ఎవరికి అర్ధమవుతుందని నరసరాజు చెప్పినా సినీ ప్రేక్షకులను అంత తక్కువగా అంచనా వేయలేమని బి.ఎన్‌.రెడ్డి సమాధానపరచారు. ‘రాజమకుటం’ చిత్రం 24 ఫిబ్రవరి 1960న విడుదలైంది. ప్రేక్షకుల స్పందన ఎలా వుందో తెలుసుకోవడానికి బి.ఎన్‌.రెడ్డి విజయవాడ వెళ్లి, వాహినీ బ్రాంచ్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంను వెంటబెట్టుకొని ఏలూరు సినిమాహాలు బెంచ్‌ తరగతి ప్రేక్షకుల మధ్య కూర్చుని చూస్తున్నారు. బి.ఎన్‌.రెడ్డి అక్కడ వున్నట్టు ఎవరికీ తెలియదు... హాలు యజమానికి తప్ప. ‘మల్లీశ్వరి’, ‘బంగారుపాప’ వంటి బి.ఎన్‌ చిత్రాలు చూసి బి.ఎన్‌.రెడ్డి ప్రతిభకు మురిసిపోయిన అభిమాని ఒకడు పక్కవాడితో ‘ఈ బి.ఎన్‌.రెడ్డికి ఇదేం పొయ్యేకాలంరా. ఇటువంటి సినిమాలు తీస్తున్నాడు?’ అన్నాడు. ప్రక్కవాడు వెంటనే ‘అది సరే... మకుటం అంటే ఏమిట్రా’ అని అడిగాడు. మొదటివాడు ‘మకుటమంటే తెలియదట్రా... మకుటమంటే.. పట్టాకత్తిరా’ అంటున్నాడు. అది వింటున్న బి.ఎన్‌.రెడ్డికి తలతీసేసినట్లయింది. వెంటనే విజయవాడ ప్రోగ్రాం రద్దుచేసుకొని మద్రాసు వచ్చేశారు. ఇరవయ్యేళ్లుగా తను సంపాదించుకున్న పేరుప్రతిష్ఠలు ఈ ఒక్క సినిమాతో మట్టికొట్టుకుపోయాయని చాలా బాధపడ్డారు. ‘రాజమకుటం’ తరువాత బి.ఎన్‌.రెడ్డి మరో జానపద చిత్రం తీసేందుకు సాహసించలేదు. అయితే ఈ సినిమాకి నష్టాలు మాత్రం రాలేదు. ఈ చిత్రంలో మరొక విశేషముంది. ఎంత గొప్ప దర్శకుడైనా కొన్నిసార్లు తమ దృష్టికి అందకుండా పోయే సంఘటనలవి. హీరో ఎన్‌.టి. రామారావు (ప్రతాప్‌), హీరోయిన్‌ రాజసులోచన (ప్రమీల)ల మీద ఒక యుగళగీతాన్ని చిత్రీకరించారు. ‘నాగరాజు’ అనే కలం పేరుతో బాలాంత్రపు రజనీకాంతరావు రాయగా మాస్టర్‌ వేణు అద్భుతంగా స్వరపరచిన ‘ఎందుండి వచ్చావో ఏ దిక్కు పోయేవో, ఊరేది పేరేది ఓ చందమామా, నిను చూచి నీలి కలువ పులకింపనేలా’ అంటూ సాగే ఈ యుగళగీతంలో రామారావు ఆలపించే ‘ఊగేటి తూగేటి ఓ కలువబాలా’ అనే పల్లవి దగ్గర రామారావు ఎడమచేతికి రిస్టువాచీ వుండడం కనిపిస్తుంది. సాధారణంగా ఒక పాటను చిత్రీకరించడానికి ఒకటి, రెండ్రోజులు పడుతుంది. ‘రషెస్‌’ వేసి చూసుకున్నప్పుడు రామారావు చేతికి గడియారం వుండడం చూసి వాహినీ సిబ్బంది నాలిక కరచుకొన్నారు. దానిని కప్పిపుచ్చడానికి మరుసటిరోజు డ్రీమ్‌ సీక్వెన్స్‌ సెట్టింగ్‌ వేసి, హీరో హీరోయిన్లకు ఆహార్యం మార్చి, మిగతా రెండు చరణాలను చిత్రీకరించారు. జాగ్రత్తగా ఈ పాటను గమనిస్తే రామారావు ఎడమచేతికి రిస్టువాచీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రంధ్రాన్వేషణ చేసే కొందరు ప్రేక్షకులు ఈ పొరపాటును వాహినీ సంస్థకు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే, ‘అది వాచీలా వుండే బ్రాస్లెట్‌’ అని జవాబిచ్చి తప్పించుకున్నారు. ఇటువంటి తప్పులు చిత్రీకరణలో కొన్ని తెలిసి, కొన్ని తెలియక జరుగుతూ వుంటాయి. అందుకే వీటిని సినిమాలు అన్నారు... దానర్ధం వినోదానికి... నవ్వుకోడానికి అనేగా!


- ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.