తీరెను కోరిక తీయ తీయగా

ఎంత గొప్ప సంగీత దర్శకులైనా వారికీ కొన్ని సంస్థలకు పనిచేయాలనే కోరిక బలీయంగా వుంటుంది. అలాంటిదే ప్రముఖ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయానికి కూడా వుండేది. ఆ తీరని కోరికే రాజ్‌కపూర్‌ సినిమాకి సంగీతం అందించాలనేది. ఆ కోరిక ‘బాబీ’ సినిమాతో తీరడమే కాకుండా రాజ్‌కపూర్‌ తరువాత నిర్మించిన ‘సత్యం శివం సుందరం’ (1978), ‘ప్రేమ్‌ రోగ్‌’ (1982) చిత్రాలకు కూడా వారే సంగీత సారధ్యం వహించారు. 1963 నుంచి ముప్పై ఐదేళ్ల వరకు హిందీ చలనచిత్ర రంగాన్ని ఒక వూపు వూపి 750 సినిమాలకు అద్భుత సంగీత దర్శకత్వం వహించిన ద్వయం లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్, ఇద్దరూ, సంగీత కుటుంబంలో పుట్టినవారే. లతాజీ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సూరీల్‌ కళాకేంద్ర మ్యూజిక్‌ అకాడమీ’లో లక్ష్మీకాంత్‌కు అవకాశం దొరికినప్పుడు అక్కడే ప్యారేలాల్‌తో పరిచయం జరిగింది. లాతాజీ ఇద్దరినీ నౌషాద్, సచిన్‌ దేవ్‌ బర్మన్, చితాల్కర్‌ రామచంద్రలకు పరిచయం చేసి అవకాశాలు ఇవ్వవలసిందిగా కోరింది. వారిద్దరూ కల్యాణ్‌ జీ ఆనంద్‌ జీల వద్ద సహాయకులుగా చాలాకాలం పనిచేశారు. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ వద్ద మ్యూజిక్‌ కండక్టర్లుగా పనిచేస్తూ వారి మన్ననలను పొందగలిగారు. ఆర్‌.డి.బర్మన్‌ వీరితో చాలా సన్నిహిత స్నేహితునిగా మెలిగారు. ఎంత సన్నిహితంగా అంటే... తొలిరోజుల్లో లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ సంగీత దర్శకత్వం వహించిన ‘దోస్తీ’ సినిమాలో పాటలకు మౌత్‌ ఆర్గాన్‌ ప్రాణం. ఆ వాద్యాన్ని వాయించింది రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ కావడం విశేషం. లక్ష్మి-ప్యారేల సంగీతం ఇంచుమించు శంకర్‌ జైకిషన్‌ల సంగీతానికి దగ్గరలో వుండేది. 1963లో బాబుభాయ్‌ మిస్త్రి ‘పారస్‌ మణి’ అనే చిత్రం ద్వారా లక్ష్మి-ప్యారేలను సంగీత దర్శకులుగా పరిచయం చేశారు. ‘హస్త హువా నూరానీ చెహరా’, ‘ఓ జబ్‌ యాద్‌ ఆయీ బహుత్‌ యాద్‌ ఆయీ’ పాటలు మరువలేనివి. తరువాత 1964లో రాజశ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మాత తారాచంద్‌ బరజాత్యా సత్యన్‌ బోస్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘దోస్తీ’ సినిమా సంగీత ప్రభంజనం సృష్టించింది. సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచి మాస్కో అంతర్జాతీయ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుంది. అంతేకాదు లక్ష్మి-ప్యారేలకు ఉత్తమ సంగీత దర్శకులుగా తొలి ఫిలింఫేర్‌ బహుమతి కూడా తెచ్చిపెట్టింది. అలాగే ఎల్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన ‘మిలన్‌’, ‘జీనే కి రాహ్‌’ చిత్రాలకు కూడా ఉత్తమ సంగీత దర్శకులుగా లక్ష్మి-ప్యారే బహుమతులు అందుకున్నారు. ‘ఫర్జ్‌’, ‘రాజా అవుర్‌ రంక్‌’, ‘మేరే హమ్‌ దమ్‌ మేరే దోస్త్‌’, ‘ఇజ్జత్‌’, ‘సాజన్‌’, ‘జీనే కి రాహ్‌’, ‘ఆయా సావన్‌ ఝూమ్‌ కె’, ‘దో రాస్తే’, ‘పుష్పాంజలి’, ‘అభినేత్రి’, ‘ఆప్‌ ఆయే బహార్‌ ఆయీ’, ‘షోర్‌’, ‘అన్హోనీ’ వంటి చిత్రాలకు అద్భుత సంగీతాన్ని అందించడమే కాకుండా చాలా సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకులుగా నామినేట్‌ అయ్యారు. ‘బర్సాత్‌’ చిత్రంతో ప్రారంభించి ‘కల్‌ ఆజ్‌ అవుర్‌ కల్‌’ వరకు రాజ్‌కపూర్‌ కుటుంబం నిర్మించిన అన్నీ సినిమాలకు శంకర్‌ జైకిషన్‌ సంగీతాన్ని అందించారు. అయితే 1970 సెప్టెంబర్‌లో జైకిషన్‌ మరణించడంతో రాజకపూర్‌కు చెప్పలేని లోటు ఏర్పడింది. ‘కల్‌ ఆజ్‌ అవుర్‌ కల్‌’ సినిమా తరువాత రాజ్‌కపూర్‌ ‘బాబీ’ చిత్రాన్ని ప్రారంభిస్తూ ఎవరిని సంగీత దర్శకునిగా తీసుకోవాలో ఆలోచనలో పడ్డారు. శంకర్‌ జైకిషన్‌ ద్వయంలో జైకిషన్‌ అంటే రాజ్‌కపూర్‌కు ప్రత్యేకమైన అభిమానం. జైకిషన్‌ మరణం రాజ్‌కపూర్‌ను నిరాశకు గురిచేసింది. శంకర్‌కు సంగీత దర్శకత్వం కట్టబెట్టినా అది అసంపూర్ణంగానే మిగిలిపోతుందని, జైకిషన్‌ లేని లోటును పూడ్చలేదనే నిర్ణయానికి రాజ్‌కపూర్‌ వచ్చేశారు.ఇక లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ విషయానికి వస్తే, ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి అలరించిన లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌కు రాజ్‌కపూర్‌ సినిమాకు సంగీతం సమకూర్చలేదన్న అసంతృప్తి వుండిపోయింది. ఒకానొక సందర్భంలో ఆ విషయం తమకు ఎంతో నిరాశను కలిగించిందని బహిరంగంగా వారు చెప్పుకున్నారు కూడా. ఆ సమయంలోనే లక్ష్మి-ప్యారేకి సంగీత బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనలో రాజ్‌కపూర్‌ వుండిపోయారు. ఆ ఆలోచన మెల్లిగా కార్యరూపం దాల్చింది. రాజ్‌కపూర్‌ ‘బాబీ’ సినిమాకు లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ను సంగీత దర్శకులుగా నియమిస్తున్నానని ప్రకటించగానే ఉప్పొంగిపోయారు. తమ చిరకాల కోరిక నెరవేరబోతున్నందులకు వారి ఆనందానికి అవధులు లేవు. ఆ సినిమాకు తమ సత్తా చూపాలని ప్రతినబూనారు. ‘బాబీ’ చిత్రంలో ఆణిముత్యాల వంటి పాటలను అందించి సంతృప్తి చెందారు. ఇందులో హీరో, హీరోయిన్లు ఇద్దరూ టీనేజర్లు. పైగా డింపుల్‌కు ఇదే తొలి అవకాశం. హీరో రిషికపూర్‌ కోసం కొత్త నేపథ్యగాయకుణ్ణి తీసుకుంటే బాగుంటుందని లక్ష్మి-ప్యారే ఆలోచించి ఆ విషయాన్ని రాజ్‌కపూర్‌కు నివేదించారు. నూతనత్వం కోరుకునే రాజ్‌ వారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలా శైలేంద్ర సింగ్‌ అనే నూతన గాయకుడు ఈ సినిమాకి పరిచయమయ్యాడు. హీరోయిన్‌ గాత్రం కోసం లతామంగేష్కర్‌ను ఎంపిక చేశారు. అప్పటిదాకా శంకర్‌ జైకిషన్‌లకు శైలేంద్ర పాటలు ఎక్కువగా రాసేవారు. అటువంటి శైలేంద్ర కూడా 1966లోనే మరణించడంతో ‘బాబీ’ చిత్రానికి ఆనంద్‌ బక్షి పాటలు రాస్తే బాగుంటుందని రాజ్‌కపూర్‌కు వీరు సూచించారు. ఆనంద్‌ బక్షి ‘బాబీ’ సినిమాలో పాటలతో తన విశ్వరూప ప్రదర్శన చేశారు. ఆనంద్‌ బక్షితోబాటు విఠల్‌ భాయ్‌ పటేల్, ఇందర్‌ జిత్‌ సింగ్‌ తులసీ లచేత మరో మూడు పాటలు రాయించారు. ఆనంద్‌ బక్షి రాయగా శైలేంద్ర సింగ్, లతాజీ ఆలపించి రిషి కపూర్, డింపుల్‌ కపాడియాల మీద చిత్రీకరించిన ‘బాహర్‌ సే కోయి అందర్‌ న ఆ సకే... అందర్‌ సే కోయి బాహర్‌ న జా సకే’ పాట, ‘ముఝే కుఛ్‌ కెహనా హై... ముఝే భీ కుఛ్‌ కెహనా హై’ అనే రెండు యుగళ గీతాలు సూపర్‌ హిట్టయ్యాయి. ఆనంద్‌ బక్షి రాయగా శైలేంద్ర సింగ్‌ ఆలపించిన మరో మధుర గీతం ‘మై షాయర్‌ తో నహీ, మగర్‌ యే హసీన్‌’ పాటను రిషికపూర్, అరుణా ఇరానీల మీద చిత్రీకరించారు. విఠల్‌ భాయ్‌ పటేల్‌ రెండు పాటలు రాశారు. సైలెబ్‌న్ద్ర సింగ్, మన్నా డే ఆలపించిన ‘నా మాంగూ సోనా చాంది, నా చాహూ హీరా మోతీ యే మేరే కిస్‌ కామ్‌ కె’ పాటను రిషికపూర్, ప్రేమ్‌ నాథ్, డింపుల్‌ బృందం మీద చిత్రీకరించారు. అందులో ప్రేమ్‌ నాథ్‌ నటన అద్భుతంగా వుంటుంది. అయితే ఈ ట్యూన్‌ని అప్పట్లో ‘అవారా’ చిత్రంలో రాజ్‌కపూర్, నర్గీస్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో వుండగా బ్యాక్‌గ్రౌండ్‌ బిట్‌గా శంకర్‌ జైకిషన్‌ వినిపించారు. తరువాత శంకర్‌ జైకిషన్‌ ఈ ట్యూనుతో పాటను రికార్డు చేశారు. అయితే రాజ్‌కపూర్‌ ఈ పాటను ఎక్కడా వాడుకోలేదు. రాజకపూర్‌ సూచన మేరకు ఈ పాటను లక్ష్మి-ప్యారే అందంగా తీర్చి దిద్దారు. అలాగే విఠల్‌ భాయ్‌ పటేల్‌ ‘ఝూట్‌ బోలె కౌవా కాటే కాలే కౌవే సే దరియో... మై మైకే చలి జావుంగీ తుమ్‌ దేఖతే రహియో’ అనే మరో అద్భుతమైన పాటను రాశాడు. లతాజీ, శైలేంద్ర సింగ్‌ ఆలపించిన ఆ పాటను ఒక విలేజ్‌ డాన్స్‌ సెట్టింగ్‌లో రిషికపూర్, డింపుల్‌ మీద చిత్రీకరించారు. ఇందర్‌ జిత్‌ సింగ్‌ తులసి రాసిన ‘బేషఖ్‌ మందిర్‌ మస్జిద్‌ తోదో, బుల్లెషా యే కెహతా... పర్‌ ప్యార్‌ భరా దిల్‌ కభీ నా తోడో’ అనే నేపథ్య గీతాన్ని ఫిలింఫేర్‌ బహుమతి గ్రహీత నరేంద్ర చంచల్‌ చేత పాడించారు. ఇందులో హీరో, హీరోయిన్‌లతోబాటు నరేంద్ర చాహల్‌ కూడా అభినయించడం విశేషం. చివరిగా లతాజీ ఆలపించిన ఏకగళ గీతం ‘జో కర్‌ కె ప్యార్‌ యార్‌ కిసీ కె దిల్‌ మే బసా... ఏ ఫసా’ అనే పాటను ఆనంద్‌ బక్షి రాయగా అరుణా ఇరానీ, రిషికపూర్, ప్రాణ్, ఫరీదా జలాల్, పించూ కపూర్‌ల మీద చిత్రీకరించారు. ఈ సూపర్‌ హిట్‌ చిత్రం సోవియట్‌ రష్యాలో కూడా అద్భుత ప్రదర్శన చేసి భారీగా విదేశీ కరెన్సీని రాల్చింది. రాజ్‌కపూర్‌ మీద వున్న గౌరవంతోనే డింపుల్‌ తల్లి జద్దన్‌ బాయి ఈ సినిమాలో నటింపజేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ సినిమా విడుదలకు ఎనిమిది నెలల ముందే రాజేష్‌ ఖన్నా డింపుల్‌ను పెళ్లాడాడు.
- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.