శోకరసం నుంచి హాస్యరసంలోకి

ప్రముఖ దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్‌ తమిళ సినీప్రపంచంలోకి 1954లో టి.కె.షణ్ముగం సహకారంతో ‘రత్తపాశం’ సినిమాతో రచయితగా అడుగు పెట్టి ‘మహేశ్వరి’, ‘ఎంగల్‌ వీట్టు మహాలక్ష్మి’, ‘మంజల్‌ మహిమై’ వంటి సినిమాలకు మాటల రచయితగా స్థిరపడ్డారు. గోవిందరాజన్, కృష్ణమూర్తిలతో కలిసి వీనస్‌ పిక్చర్స్‌ సంస్థను నెలకొల్పి ‘అమరదీపం’, ‘ఉత్తమ పుతిరన్‌’కు మాటలు రాయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. 1959లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ ‘కళ్యాణ పరిసు’ (తెలుగులో ‘పెళ్లి కానుక’) నిర్మిస్తే అది 25 వారాలకు పైగా ఆడి, అటు తమిళంలో, ఇటు తెలుగులో చరిత్ర సృష్టించిది. తరువాత 1961లో ‘చిత్రాలయ’ అనే సొంత బ్యానర్‌ మీద శ్రీధర్‌ వరస సూపర్‌ హిట్‌ సినిమాలు తీసి ఫాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్నారు. ‘విడివెల్లి’, ‘తేన్‌ నెలవు’, ‘సుమైత్తాంగి’ ‘పోలీస్‌ కారన్‌ మగళ్’, ‘నెంజిల్‌ ఒరు ఆలయం’, ‘నెంజం మరప్పతిల్లై’, ‘కాలై కోవిల్‌’ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించి జాతీయ అవార్డులతోబాటు ఫిలింఫేర్, రాష్ట్ర అవార్డులెన్నో గెలుచుకున్నారు. వీటితోబాటు తెలుగులోనే కాకుండా ‘భాయి-భాయి’, ‘నజరానా’, ‘దిల్‌ ఏక్‌ మందిర్‌’ వంటి హిందీ సినిమాలు కూడా స్వీయ దర్శకత్వంలో నిర్మించి ఆరోజుల్లో సూపర్‌ హిట్‌ నిర్మాత-దర్శకునిగా గుర్తింపుపొందారు. అయితే శ్రీధర్‌ నిర్మించిన సినిమాలు ఎక్కువగా విషాదాంతమయ్యేవిగా, సెంటిమెంట్‌తో కూడినవిగా వుండేవి. కథాబలం గొప్పది కావడంతో విషాదాంతమైనా కూడా అవి ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేవి. చిత్రసీమలో చిత్రాలయ గోపు అని పిలిపించుకునే శటకోపన్‌ శ్రీధర్‌కి చిన్ననాటి మిత్రుడు. ఇద్దరూ చెంగల్పట్టులో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పట్లోనే ఇద్దరూ సరదాగా కథలు రాస్తుండేవారు. గోపు హాస్య ప్రధాన కథలు రాయడంలో దిట్ట. 1959లో శ్రీధర్‌కి వీనస్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద గోవిందరాజన్, కృష్ణమూర్తి భాగస్వాములుగా సొంతంగా ‘కళ్యాణ పరిశు’ (తెలుగులో ‘పెళ్లికానుక’) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కినప్పుడు, గోపు చేత ఆ సినిమాకి కామెడీ ట్రాక్‌ రాయించాడు. సినిమా సూపర్‌ హిట్టయింది. అంతకుముందు శ్రీధర్‌ సెంటిమెంటల్‌ చిత్రాలకు కథలు, సంభాషణలు సమకూర్చి ఉన్నారు.దర్శకుడయ్యాక ‘నెంజిల్‌ ఒరు ఆలయం’ (తెలుగులో ‘మనసే మందిరం’), ‘పోలీస్‌ కారన్‌ మగళ్’ (‘కానిస్టేబుల్‌ కూతురు’), ‘మీందా సొర్గం’, ‘విడివెల్లి’,’ ’తేన్‌ నిలవు’, ‘సుమైతాంగి’ ‘కళ్యాణపరిశు’ ‘నెంజం మరప్పతిల్లై’, ‘కాలై కోవిల్‌’ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించి జాతీయ అవార్డులతోబాటు ఫిలింఫేర్, రాష్ట్ర అవార్డులెన్నో గెలుచుకున్నారు. 1963లో ఒకసారి శ్రీధర్, గోపు కలిసి మేరీనా బీచ్‌ వద్దకు వ్యాహ్యాళికి వెళ్ళి సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ‘‘ఎప్పుడూ సెంటిమెంటల్‌ కథలను సినిమాలకు రాస్తూ, దర్శకత్వం వహిస్తున్నావు. కొంచెం ట్రాక్‌ మార్చి ఒక మంచి ఫుల్‌ టైమ్‌ కామెడీ సినిమాకు కథ అల్లి సినిమా నిర్మాణం చేపట్టకూడడా. అప్పుడు నీమీద సెంటిమెంట్‌ కథల దర్శకుడు అనే అపప్రధ తొలగిపోతుంది కదా’’ అని సూచన చేశాడు. అయితే శ్రీధర్‌ ఈ విషయాన్ని సరదాగా తీసుకున్నాడు. ఇదిలా వుండగా నెల్లూరు బెజవాడ గోపాలరెడ్డి కుటుంబంలో దేవసేన అనే వధువును శ్రీధర్‌ పెళ్ళాడే సందర్భంలో కొందరు శ్రేయోభిలాషులు, మిత్రులు ‘‘మీరు ఎక్కువగా ట్రాజేడీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ పెళ్లి సందర్భంగానైనా ఒక కామెడీ సినిమాను నిర్మించి పెళ్లికానుకగా ఇవ్వచ్చుకదా’’ అని కోరినప్పుడు మిత్రుడు గోపు చేసిన సూచన కూడా శ్రీధర్‌కు గుర్తుకొచ్చింది. అప్పుడు గోపుతో కలిసి మెరీనా బీచ్‌ సాక్షిగా ‘కాదలిక్క నేరమిల్లై’ (1964) సినిమాకు కథను అల్లారు. ఈ సినిమాను శ్రీధర్‌ కేవలం నాలుగు నెలల్లో నిర్మించారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అప్పట్లో వైద్య విద్యను అభ్యశిస్తున్న రవిచంద్రన్‌ (అసలు పేరు పి.ఎస్‌.రామన్‌)ను హీరోగా, ఎయిర్‌ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్న కాంచన (అసలు పేరు వసుంధరా దేవి)ను పరిచయం చేసిన సినిమా ఇదే. అంతేకాదు తమిళంలో నిర్మింపబడిన తొలి ఈస్టమన్‌ కలర్‌ సినిమా కూడా ఇదే. ఇక తెలుగులో పి.పుల్లయ్య ‘ప్రేమించిచూడు’ పేరుతో ఈ సినిమాను ఎంత చక్కగా మలిచారో, ముళ్ళపూడి వెంకటరమణ ఎంత గొప్పగా కామెడీ పండించారో అందరికీ తెలిసిందే!- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.