రామ్‌ ‘యువసేన’తోనే పరిచయం అవ్వాల్సింది కానీ..

రా
మ్‌.. ‘దేవదాసు’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇలియానా కథానాయిక. దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడు. ఇందులో రామ్‌ నటన, నృత్యాలు యువతను మెప్పించాయి. తొలి చిత్రంతోనే అందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత వరస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌. అయితే, రామ్‌ దేవదాసుగా కనిపించక ముందే వేరే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవ్వాల్సింది. ఎలా? ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోర్‌ ‘యువసేన’ చిత్ర తెలుగు రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్న సమయంలో రామ్‌ని కథానాయకుడుగా ఎంపిక చేద్దామనుకున్నారట. అదే సమయంలో వైవీఎస్‌ చౌదరి ఓ రోజు రవి కిశోర్‌ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ రామ్‌ నటించిన ఓ లఘు చిత్రం కనిపించిందట. అప్పటికే వైవీఎస్‌ కథను సిద్ధం చేసుకుని నూతన నటీనటులతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్‌ కనపడటం, తన నటన ఆకట్టుకోవడంతో ‘దేవదాసు’లో కథానాయకుడుగా రామ్‌ని ఎంపిక చేసుకున్నాడట. దానికి రవి కిశోర్‌ పచ్చ జండా ఊపడంతో 2004లో ‘యువసేన’తో రావాల్సిన రామ్‌ 2006లో ‘దేవదాసు’గా వచ్చాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.