పట్టుదల పెంచిన ‘దేవదాసు’అసలు ‘దేవదాసు’ జీవితమే కష్టాల కడలి. అందులోనూ అనేక భాషల్లో వచ్చిన ఈ దేవదాసు నవలను తెలుగులో తీయాలని నిర్మాత డి.ఎల్‌.నారాయణ (డి.ఎల్‌) సంకల్పించడం పలువురు సినీ ప్రముఖులకు నచ్చలేదు. పైగా అక్కినేని నాగేశ్వరరావు దేవదాసుగా నటిస్తాడని డి.ఎల్‌ ప్రకటించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. జానపద చిత్రాల్లో వేషాలు కట్టే నాగేశ్వరరావు దేవదాసా? అంటూ పరిశ్రమ పెద్దలు తలా ఒకరకంగా వ్యాఖ్యలు చేశారు. సినిమాకు జానపదాలు తీసుకునే వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహిస్తాడని, చిన్నచిన్న పాత్రలు పోషిస్తున్న సావిత్రి పార్వతి వేషం కట్టబోతుందని తెలిసాక విమర్శలు, నిందలు ఎక్కువయ్యాయి. ఈ సినిమా తీస్తే అటు వినోదా సంస్థ, ఇటు డి.ఎల్‌ కూడా వీధిన పడడం ఖాయం అంటూ శాపనార్ధాలు, వెక్కిరింతలు మొదలయ్యాయి. దాంతో డి.ఎల్‌కు పంతం పెరిగింది.‘‘ఏమైనా సరే ‘దేవదాసు’ సినిమా తీద్దాం.... అందరం కష్టపడి పనిచేద్దాం. కృషికి తగిన లబ్ది దరిచేరకపోదు’’ అంటూ ఉత్సాహపరచినా కొందరు మిత్రులు మాత్రం ‘‘దేవదాసు’ విషాదాంత సినిమా, హీరో, హీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు. అటువంటి కథను ప్రేక్షకులు ఎవరు చూస్తారు?’’ అంటూ నిరుత్సాహపరచారు. అయితే దర్శక నిర్మాత బి.ఎన్‌.రెడ్డి మాత్రం ‘‘దేవదాసు మానసిక క్షోభను అనుభవించే పాత్ర. సంఘర్షణను ఎదుర్కొనేది. బాగా కృషి చేయగలిగితే తప్పక విజయవంతమౌతుంది’’ అని దీవించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుకు ఇదో సవాలుగా పరిణమించింది. ఏదేమైనా ఎదురీదాలి అని నిర్ణయించుకున్నారు. దేవదాసు నవలను మళ్ళీ మళ్ళీ చదివారు. చక్రపాణితో కూర్చొని దేవదాసు పాత్ర గుణగణాలను, ప్రవర్తనాసరళిని, మనస్తత్వాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. తనకు ఆ పాత్రను అద్భుతంగా పోషించగలను అనే నమ్మకం వచ్చింది. అసలే పట్టుదలగల మనిషి కావడంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ విమర్శల తాకిడి మధ్య సముద్రాల రాఘవాచార్య, వేదాంతం రాఘవయ్య ఇద్దరూ కూర్చొని దేవదాసు పాత్ర ప్రేక్షకుల సానుభూతిని పొందేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా రచన చేశారు. సముద్రాల శరత్‌ సాహిత్యాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసి, చక్రపాణితో విశేషంగా చర్చలు జరిపి, దేవదాసు పాత్రని తెలుగుదనం వచ్చేలా మలిచారు. మద్దిపట్ల సూరితో బెంగాలీ మూలంలోని దేవదాసు పాత్ర స్వభావం ఎలావున్నదో చర్చించారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి సలహాలు, సూచనలు పాటించారు. నవలలో కొన్ని మార్పులు చేసి, చిత్ర కథనాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా భావించి అద్భుతమైన చిత్రానువాదానికి సముద్రాల శ్రీకారం చుట్టారు. ‘దేవదాసు’ చిత్ర సంభాషణలు కఠిన పదాలు లేకుండా వ్యవహారిక భాషలోనే నడిచేలా జాగ్రత్తలు పాటించారు. అంచేత దేవదాసు కథ తెలుగునాటే జరిగిందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. ‘దేవదాసు’ సంభాషణలు అతని సంస్కారానికి అద్దంపట్టేలా అమరాయి. 07-11-1951న రేవతి స్టుడియోలో డి.ఎల్‌ ప్రారంభ పూజ నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒకటి, రెండు మినహా అన్ని పాటల రికార్డింగ్‌ జరిగింది. సినిమాకు మంచి సంగీతం కుదిరింది. అయితే షూటింగ్‌ ప్రారంభ దశలోనే సంగీత దర్శకులు సి.ఆర్‌.సుబ్బురామన్‌ 27-06-1952న హఠాన్మరణంతో చిత్ర నిర్మాణం ఆగిపోయింది. దాంతో చిత్రసీమలో మరలా దుమారం రేగింది. సుబ్బురామన్‌ మరణం అశుభసూచకంగా ప్రచారమైంది. ఈ విమర్శలు డి.ఎల్‌.నారాయణ పట్టుదలని పెంచడమే కాకుండా ‘దేవదాసు’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి ఉపయోగపడ్డాయి. కొంతకాలం ఆగి మళ్లీ చిత్రనిర్మాణం కొనసాగిద్దామనుకుంటే, కాల్షీట్లు సర్దుబాటు కాలేదు. ఈలోగా రామచంద్ర కాశ్యప, చంద్రకుమారి, సావిత్రి, గోవిందరాజుల సుబ్బారావు, పేకేటిలతో డి.ఎల్‌. చిన్నబడ్జెట్‌లో ‘శాంతి’(1952) అనే చిత్రాన్ని నిర్మించారు. చిత్రం యావరేజిగా ఆడింది. ఎట్టకేలకు ‘దేవదాసు’ చిత్ర నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. డి.ఎల్‌కి అక్కినేని నటన మీద ఎంతో నమ్మకం. విమర్శలకు జడవలేదు.

తెలుగులో వచ్చిన మొదటి విషాద ప్రేమకథా చిత్రం భరణీ పతాకంపై భానుమతి రామకృష్ణ తీసిన ‘లైలా మజ్నూ’(1949). ఈ చిత్రంలో ఖైస్‌గా అక్కినేనిని ఎంపిక చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. అయితే అక్కినేనికి ఆ చిత్రం మంచి పేరు తెచ్చింది. అక్కినేని దేవదాసు పాత్రను మరింత లోతుగా విశ్లేషించుకుంటూ, వీలున్నపుడల్లా చక్రపాణితో కూర్చుని ఆ పాత్ర ప్రవృత్తి, నడవడిక, స్థితిగతుల్ని చర్చిస్తూ దేవదాసు పాత్రని అవగాహన చేసుకొని, తాగుడుకు బానిసైన భగ్న ప్రేమికునిగా నటించి మెప్పించారు. తాగుడు దృశ్యాలు మంచి ఎఫెక్టుతో రావాలని వాటిని రాత్రుళ్లు చిత్రీకరించారు. అక్కినేని రాత్రుళ్లు బాగా పెరుగన్నం తిని, నిద్రమత్తును తట్టుకుంటూ అరమోడ్పు కన్నులతో నటించి అవసరమైన ఎఫెక్టును తీసుకొని వచ్చారు. ఈ చిత్రంలోని తాగుడు దృశ్యాలు 50 రాత్రుళ్లు ఏకబిగిన చిత్రీకరించారు. బి.ఎస్‌ రంగా ఛాయాగ్రహణ పనితనం ఈ చిత్రానికి హైలైట్‌. చాలా ఫిలిం వృధా అయ్యింది. కానీ డి.ఎల్‌ బాధ పడలేదు. సన్నివేశాలు బాగా పండాలని మాత్రమే ఆయన ఆశించారు. మేకప్‌ మన్‌ మంగయ్య అక్కినేనిని అద్భుతంగా రూపుదిద్దాడు. చేతులమీద నరాలు, బొమికలు చిక్కినట్టు కనిపించేందుకు చేతివేళ్ళ సందుల్లోకూడా మేకప్‌ అద్దేవాడు. దర్శకుడు రాఘవయ్య సెట్లో సరంజామాని తనే సర్దేవారు. కొన్నిసార్లు అక్కినేనే స్వయంగా ఫిల్ములు మోసుకెళ్లి షూటింగ్‌లో అందజేసేవారు. సంశయ నివృత్తి కోసం దేవదాసు అనువాద నవల ప్రతులను షూటింగ్‌ స్పాట్‌లో వుంచేవారు. అంతా ఒక బృందంగా పనిచెయ్యడం వల్లే చిత్రం ఆద్యంతం అద్భుతంగా అమరింది. తాగుడు పాటలు పాడేటప్పుడు ఐస్‌ ముక్కలు నోట్లో పెట్టుకుని ఘంటసాలను పాడమన్నారు రాఘవయ్య. దానివల్ల శ్రుతి తప్పిపోయే స్థితి రావడంతో ఆ ప్రయోగం మానుకున్నారు. రాఘవయ్య స్వయంగా నృత్యదర్శకుడు కావడంతో పాటల చిత్రీకరణ బాగా కుదిరింది. ‘‘సైగల్‌ నటించిన ‘దేవదాస్‌’ చిత్రాన్ని ఒకసారి చూద్దామా’’ అని అక్కినేని అడిగితే డి.ఎల్‌ ససేమిరా అన్నారు. ‘‘ఆ సినిమాలోని దేవదాసు పాత్ర ప్రభావం నీ మీద పడకూడదు’’ అని వారించారు. జూన్‌ 26, 1953న ‘దేవదాసు’ చిత్రం విడుదలైంది. పండితులు, పామరులు కూడా సినిమాని మెచ్చుకున్నారు. అక్కినేనికి, సావిత్రికి చాలా మంచి పేరొచ్చింది. ప్రారంభానికి ముందు ముక్కున వేలేసుకున్న చిత్రపరిశ్రమ, సినిమా విడుదలయ్యాక ఆ ఘనవిజయం చూసి మరోసారి ముక్కున వేలేసుకుంది.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.