సినిమాపై సూటు పందెం!

బాలీవుడ్‌లో 1965లో వచ్చిన ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. సూరజ్‌ ప్రకాష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బ్రిజ్‌ కత్యాల్‌ కథ సమకూర్చి సంభాషణలు రాసారు. ఈ కథను ‘షోలే’ నిర్మాత జిపి సిప్పీ సహా మరో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు కూడా తిరస్కరించారు. సినిమా ఎనిమిది వారాలు ఆడుతుందని శశికపూర్, 25 వారాలు ఆడుతుందని సూరజ్‌ ప్రకాష్‌ పందెం కాశారు. పందెం గెలిచినవాళ్లు బర్లింగ్‌టన్‌లో సూటు కుట్టించి ఓడిన వాళ్లకు ఇవ్వాలనేది పందెం. ఈ సినిమా 25 వారాలు కాదు ఏకంగా 50 వారాలకు పైగా ఆడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా షూటింగ్‌ కాశ్మీరులో జరుగుతున్నపుడు మహారాష్ట్రకు చెందిన ఒక లెప్టినెంట్‌ కల్‌నల్‌ హీరోయిన్‌ నందా అందానికి ముగ్దుడై ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. అది జరగలేదనేది వేరే సంగతి. ఈ సినిమాలో పడవ నడిపే యువకునిగా నటించిన శశికపూర్, స్థానిక బోటు డ్రైవర్లతో కలిసివుంటూ, వారి జీవనశైలిని, ఆహార పద్ధతుల్ని అధ్యయనం చేసి మరీ పాత్ర పోషణ చేశాడు. ఈ సినిమా విజయంతో రచయిత బ్రిజ్‌ కత్యాల్, రచయిత ఆనంద్‌బక్షిల డిమాండ్‌ ఆకాశాన్నంటింది. కళ్యాణ్‌ జీ-ఆనంద్‌ జీ సంగీతంలో వచ్చిన ‘‘ఏక్‌ థా గుల్‌ అవుర్‌ ఏక్‌ థి బుల్‌బుల్‌’’, ‘‘పరదేశియోం సే ఆంఖియా మిలానా’’, ‘‘ఏ సమా సమా హై ప్యార్‌ కా’’ పాటలు మంచి హిట్లుగా నిలిచాయి.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.