మ్యూజిక్‌ అలా.. క్లైమాక్స్‌ ఇలా..

‘జయం మనదేరా!’.. వెంకటేష్‌ నట విశ్వరూపం చూపించిన చిత్రం. పవర్‌ఫుల్‌ గెటప్‌లో ఆయన పేల్చిన డైలాగులు ఎప్పటికీ మరులేం. ఎన్‌. శంకర్‌ దర్శకత్వంలో వెంకీ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం...

* నచ్చితేనే పేరు...

వందేమాతరం శ్రీనివాస్‌ అందించిన సంగీతం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులోని ప్రతిపాట శ్రోతల్ని ఊపేసింది. ఇప్పటికీ ఏదో సందర్భంలో ఈ గీతాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా సినిమా విడుదలయ్యాక తెలిసిన విషయం. మరి సినిమా విడుదలకు ముందు సంగీతం విషయంలో ఏమైందంటే... చిత్ర దర్శకుడు శంకర్‌, వందేమాతరం శ్రీనివాస్‌ చాలాసార్లు కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రానికి ఆయన్నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనుకుని, ఆ మాటను వెంకీకి చెప్పగా ‘శ్రీనివాస్‌ విప్లవ గీతాలు ఎక్కువగా ఇస్తారు కదా! ఈ సినిమా చేయగలరా’ అని అన్నారట. ‘మీరిచ్చే సంగీతం నచ్చితే మీ పేరు వేస్తాం. లేకపోతే వేయం’ అని నిర్మాణ సంస్థ ఓ షరతు పెట్టింది. దాన్ని స్వీకరించి తానేంటో తన సంగీతంతోనే నిరూపించుకున్నారు శ్రీనివాస్‌.


* సమయం లేకపోవడంతో..

క్లైమాక్స్‌ విషయంలోనూ విభేదాలు తలెత్తాయి. శంకర్‌ రాసుకున్న క్లైమాక్స్‌ వెంకీకి వినిపించగా.. ‘కొంచెం మాస్‌ నేపథ్యంలో ఉంటే బావుంటుంది. ఓ హిందీ చిత్రంలో ఉన్నట్లు చేద్దామని’ సలహా ఇచ్చారు. నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌ ఓ నిర్ణయానికొచ్చింది. రెండు రకాలుగా చిత్రీకరిద్దాం. ఏది బావుంటే అదే ఓకే చేద్దాం అనుకుంది. ముందుగా హిందీ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. సమయం లేకపోవడంతో రెండో భాగం షూట్‌ చేయలేదు. దాంతో హిందీ చిత్రం ఆధారంగా షూట్‌ చేసిన సన్నివేశాన్నే విడుదల చేశారు. ఈ చిత్రంలో వెంకీ సరసన భానుప్రియ, సౌందర్య కనిపించి అలరించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.