అలా.. జయప్రద ఎంపికయ్యారు

సదవకాశం వచ్చినపుడు వదులుకుని తర్వాత బాధపడటం అన్ని రంగాల వ్యక్తుల జీవితంలో జరుగుతుంటుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా డబ్బుతోపాటు అంతుకు మించిన పేరు తీసుకొస్తుంది. తరతరాలు నిలిచే పాత్ర అయితే నటీనటులకు కావాల్సిందేముంటుంది? సహజనటి జయసుధకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎప్పుడో మీకు తెలుసా.. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌.. కమల్‌ హాసన్, జయప్రద జంటగా తెరకెక్కిన చిత్రం ‘సాగరసంగమం’. నృత్యం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది. తెలుగు సినిమా ఉన్నంతకాలం చెప్పుకునే, చెప్పుకోదగిన కళాఖండం ‘సాగరసంగమం’. ఇందులో బాలకృష్ణగా కమల్, మాధవిగా జయప్రద నటన అత్యద్భుతం. ఈ రెండు పాత్రలు టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. అందుకే అధికశాతం నటులు మీకు నచ్చిన సినిమా ఏది అంటే? టక్కున ‘సాగరసంగమం’ అని.. అవకాశం వస్తే పాత చిత్రాల్లోని ఏ పాత్రను పోషిస్తున్నారు అనగానే వెంటనే కమల్, జయప్రద అని చెప్తుంటారు. మరి అలాంటిది జయసుధ ఎందుకు చేయలేకపోయారంటే... ముందుగా ఈ కథ జయసుధ దగ్గరకి వెళ్లింది. అంతా ఓకే అయింది. ఆమె అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల జయసుధ ఈ ప్రాజెక్టులో నటించలేకపోయారు. దాంతో మరో నటి అన్వేషణలో భాగంగా జయప్రద ఎంపికయ్యారు. తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.