కమల్‌హాసన్‌ కళ్లలో నీరు కోసం... మారిపోయిన దర్శకుడు!

వియమ్‌ నిర్మాత చెట్టియార్‌కి సినిమాలో స్పష్టత, నిర్దిష్టత కావాలి. ఆయన తీసిన అన్ని సినిమాల్లోనూ రీషూటింగ్‌లు ఉంటాయి. ‘రి షూటింగ్‌ నాకు సరదాకాదు, కాల్‌షీట్సు తెచ్చుకోవాలి, ఖర్చు ఎక్కువ. ఒకసారి స్క్రిప్టు రాసుకున్నాక, చదివిన తరువాత మార్పులు చేస్తాం కదా - ఇదీ అంతే!’ అని చెప్పేవారు. ‘భక్తప్రహ్లాద’లో కొన్ని దృశ్యాలు, ‘మూగనోము’లో కొన్ని దృశ్యాలు రీషూట్‌ చేయించారు ఆయన. ‘మూగనోము’కి మూలచిత్రం, ఎవియమ్‌ వారే తీసిన ‘కళత్తూరు కన్నమ్మ’ - తమిళం. దీనికి ముందుగా దర్శకుడు తాతినేని ప్రకాశరావు. కమల్‌హాసన్‌ బాలనటుడు. విచారంగా పాడతాడు. ఆ దృశ్యం చూసి, చెట్టియార్, ‘‘కమల్‌హాసన్‌ కళ్లలో నీరుంటే బాగుంటుంది. మల్లీ షూట్‌ చెయ్యండి’’ అన్నారు. ప్రకాశరావు ఒప్పుకోలేదు! ‘‘అతని కళ్లలో నీళ్లు అక్కర్లేదు’’ అని వాదించారు. మొత్తానికి ప్రకాశరావు ‘‘నేను చెయ్యను’’ అని మానేశారు. చెట్టియార్‌ భీమ్‌సింగ్‌ని దర్శకుడిగా పెట్టి చిత్రం పూర్తి చేయించారు. మొత్తానికి సినిమా హిట్‌ అయ్యింది. తమిళ సినిమాని, డబ్‌ చెయ్యకుండా, మధ్యమధ్యలో తెలుగు కామెంటరీ చెప్తూ తెలుగుదేశంలో విడుదల చేశారు. దాన్నే మళ్లీ తెలుగులో ‘మూగనోము’ పేరుతో తీశారు. నాగేశ్వరరావు, జమున ముఖ్యనటులు. ఇందులో కూడా ఒక పాటని రిషూట్‌ చేయించారు చెట్టియార్‌.


- రావి కొండలరావు  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.