సినిమా క్రేజ్‌ అలాంటిది!

నాటకాల్లో నటించిన నటులే దాదాపు సినిమాలకు వచ్చారు. ఆ నటులు అంతకు ముందు ప్రసిద్ధి పొందినా, సినిమాలకి వచ్చిన తర్వాత ఆ ప్రసిద్ధి సుప్రసిద్ధి అయింది. దాంతో వాళ్లు మళ్లీ నాటకాల్లో నటించినప్పుడు ప్రేక్షకులు విరగబడేవారు. తెరమీద కనిపించే నటుల్ని విడిగా చూడాలన్న కోరిక తొలినాటి నుంచీ ఉంది. అంచేత, నాటకానికి సంబంధించిన కరపత్రాల్లో ‘‘అందరూ సినిమా నటులే. త్వరపడండి’’ అని ప్రకటించేవారు. అలా నాటకాల నుంచి సినిమాలకీ, సినిమాల నుంచి నాటకాలకీ వెళ్లిన వాళ్లలో ప్రముఖంగా సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు, వేమూరి గగ్గయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, సూరిబాబు, నిడుముక్కల సుబ్బారావు, రఘురామయ్య, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి - ఇలా ఎందరో. కన్నాంబ, శాంతకుమారి, రామతిలకం నాటకాల నుంచి సినిమాలకి వచ్చినా, తిరిగి నాటకాల్లో పాల్గొనలేదు. సినిమాల్లోనే ఉండిపోయారు. కారణం ఏమిటంటే - అప్పట్లో జనం అందరి మీద పడినట్టే, స్త్రీ నటుల మీద కూడా పడిపోయేవారు. నియంత్రణ ఉండేది కాదు. పోలీసుల రక్షణ ఉండేది కాదు. అంచేత నాటకాల్లో నటించడానికి రాలేదు. శ్రీకాకుళంలో నేను ఉన్నప్పుడు పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, సారంగధర లాంటి నాటకాలు చూశాను. ‘పాదుకా పట్టాభిషేకం’ (అంత పేరు పలక్క ‘పాదుక’ అనేవారు)లో సిఎస్‌ఆర్‌ రాముడు, సూరిబాబు దశరథుడు - నాకు గుర్తున్నారు. సావిత్రిలో వేమూరు గగ్గయ్య (యముడు) మాత్రమే గుర్తున్నారు. ఈ నాటకాలకు విపరీతమైన జనం వచ్చే వారు - ఒక పక్క సినిమాలు ఆడుతున్నా! ‘పాదుక’ నాటకం అయిన మర్నాడు బస్సు స్టాండులో నటులు నిలబడి ఉండగా జనం మూగారు. నేనూ మూగాను. మూగినవాడి మూగినట్టుండక - సిఎస్‌ఆర్‌ గారిని - ‘‘మీరు ‘శివగంగ’ అన్న సినిమా డైరెక్టు చేశారు. అది పూర్తి కాలేదు - ఎందుకండీ?’’ అని అడిగితే, ‘‘ఇప్పుడెందుకు నాయనా ఆ సంగతి? నీ పని నువ్వు చూసుకో. స్కూలుకు పోతున్నట్టున్నావు - పో’’ అని గసిరారు. ఎక్కువ మంది ఆటోగ్రాఫ్‌లు అడగలేదు. అప్పట్లో అది అంత ప్రాముఖ్యం పొందలేదు. ఇంకోసారి, వేమూరు గగ్గయ్య మునిసిపల్‌ బంగళాలో ఉన్నారని విని అక్కడికి పరుగెత్తాం. ఆయన వెనక భాగంలో ఉన్న చెట్టు కింద ఉన్నారని తెలిసి, గోడ ఎక్కాను. ఆయన నన్ను నాతోపాటు గోడెక్కిన ఇంకొకడినీ చూసి - ‘‘ఏమిటి పని మీకు ఇక్కడ? దిగండి. గోడ దిగిపోండి’’ అనగానే ఎవరో వచ్చి - కర్ర తాటించారు. లాభం లేదని, ఇద్దరం వెనుదిరిగాం. ‘‘సినిమా క్రేజ్‌’’ అనే అభిమానం అలా ఉంటుంది. అయితే, తిట్లతోనే అభినందనలో, ధన్యవాదాలో ముట్టాయి.

- రావి కొండలరావు

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.