అందాల నటి అవసాన దశ!

ఒకనాటి అందాలతార కాంచనమాల, వేరే సినిమాల్లో కనిపించడానికి వీలులేకుండా జెమిని వారు ఆంక్షలు పెట్టారు. దాంతో బాధ పడిన కాంచన మాల ఆ తర్వాత మనసు పాడుచేసుకుని పిచ్చిదై పోయింది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఏమీ చెయ్యలేకపోయాయి. ఎవరూ గుర్తులేరు, ఏమీ గుర్తులేదు. రాజ్యం పిక్చర్స్‌ వారు ‘నర్తనశాల’ (1963) నిర్మిస్తూ కాంచనమాలని ఒక దృశ్యంలో నటింపజేసారు. కాంచనమాల, లక్ష్మీరాజ్యం దగ్గర బంధువులు మళ్లీ షూటింగ్, పరిసరాలు చూస్తే కాంచనమాల కోలుకోవచ్చునన్న భావంతో వేషం వేయించారు. ఒక బిడ్డని ఇద్దరు స్త్రీలు ‘‘నా బిడ్డ’’ అంటే ‘‘నాబిడ్డ’’ అని తగువులాడుకోడం, ధర్మరాజు తీర్పు చెప్పడం దృశ్యం.. సూర్యకాంతం, కాంచనమాల నటులు. కాంచనమాల అభిమానులు మళ్లీ ఆమె నటిస్తుందని ఆమెను చూడాలనీ, ఎందరో షూటింగ్‌దగ్గరకి వచ్చారు. చిత్రం దర్శకుడు కె.కామేశ్వరరావు కాంచనమాలని పలకరించి ‘‘నేను గుర్తున్నానా?’’ అని అడిగారు. ఆమె నటించిన ‘గృహలక్ష్మి’, ‘వందేమాతరం’ చిత్రాలకి ఆయన సహాయదర్శకుడు. ఆమె పిచ్చి చూపులు చూసిందిగాని, సమాధానం చెప్పలేదు. అలాగే, సముద్రాల రాఘవాచార్య కూడా ఆమెను అడిగారు ‘‘నేను ఎవరో తెలుసునా? ఎప్పుడు చూశావు?’’ అని అప్పుడు అదే జవాబు! అనారోగ్యం, వయసు, కలసి కాంచనమాలని బాగా మార్చేసాయి. అభిమానులు, నిరుత్సాహపడి వెళ్లిపోయారు. ఒకే ఒక సంభాషణని, ఆమె చేత చెప్పించడానికి అందరూ చాలా అవస్థపడ్డారు. సినిమా పరిసరాలు చూస్తే కాంచనమాలకి పాత విషయాలు గుర్తుకు వస్తాయని భావించిన వాళ్లందరూ నిరాశకీ, నిరుత్సాహానికి గురయ్యారు.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.