కాంచనమాలతో బి.ఎన్‌.రెడ్డి ప్రయోగం

కసారి బి.ఎన్‌.రెడ్డి ఇలా చెప్పారు...: ‘‘వందేమాతరం’ (1939) సినిమా నా తొలి సినిమా. ఛాయాగ్రాహకుడు, స్క్రీన్‌ప్లే రచయితా అయిన రామ్‌నాథే నాకు సహకారం అందించారు. ఆ సినిమాలోని నాయిక (కాంచనమాల) కొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది. తప్పిపోయిన కొడుకు తల్లి కోసం తిప్పలు పడుతూ ఉంటాడు. నాయిక అందరినీ అడుగుతూ ఉంటుంది. గుళ్లూ గోపురాలూ తిరుగుతుంది. ఆ తిరగడంలో నీరసించి పోతుంది. దిగులు, బాధతో ముఖం వాడిపోయి ఉంటుంది. ఒక దశలో కొడుకు దూరంగా కనిపిస్తాడు. అమ్మా అని పిలుస్తాడు. బాబూ అని తనూ పరుగెత్తుతుంది. అట్నుంచి వాడూ, ఇట్నుంచి ఈమే వీధిలో పరిగెత్తుతారు. కొడుకుని చూడగానే ఆమె ముఖం వికసిస్తుంది. ఇలాంటి షాట్స్‌ తీసేటప్పుడు సాధారణంగా ఆమె చేత పరుగెత్తించి షూట్‌ చేస్తాం అలాగే అబ్బాయినీ పరుగెత్తిస్తాం. ఆ షాటు, ఈ షాటు కట్‌ చేస్తూ వేగం తెస్తాం. చివరికి ఇద్దరూ కలుస్తారు. అయితే రామ్‌నాథ్‌ సూచనతో అలా తియ్యలేదు. దూరంగా కొడుకు కనిపిస్తున్నాడు. తాను పరుగెత్తుతోంది. ఆమె ముఖం కాంతివంతం కావాలి. దానికి, ఆమె చేత నాలుగు అడుగులు పరుగెత్తాక, మళ్లీ కట్‌చేసి, మేకప్‌తో టచ్‌ఆప్‌ చేయించాం. మళీ ఇంకాస్త బ్రైట్‌ చేయించాలి. అలా అలా ముఖంలో వికాసం కల్పిస్తూ చివరికి వచ్చేసరికి పూర్తిగా ముఖం కాంతివంతం అయ్యేలా చూపించాం. షాట్స్‌ కట్‌చేసి, కలిపి వేసినప్పుడే ఆమె పరిగెత్తుతూ ఉంటే, క్రమేణా ముఖం వికసిస్తున్నట్టుగా కనిపించింది. అబ్బాయిని హత్తుకోగానే ముఖంలో ఉన్న విషాదం మాయమై, ఆనందం కనిపిస్తుంది. ఇదొక ప్రయోగం. ఇలా ఎవరూ చెయ్యకపోవచ్చు కాని మేం చేశాం. పరిపూర్ణత సిద్ధించింది. ఈ రోజుల్లో అయితే, ఎవరూ అలా ఆగి ఆగి మేకప్‌ చేయించరు. నటులు చేయించుకోరు. నిర్దిష్టత కోసం పాకులాడిన రోజులవి’’.- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.