తమిళ చిత్రానికి హిందీ సంగీత దర్శకుడు షెహనాయి!

తమిళ దర్శక నిర్మాత బి.ఆర్‌.పంతులు భారీతారాగణంతో ‘కర్ణన్‌’ చిత్రాన్ని పద్మిని పిక్చర్స్‌ పతాకం మీద రంగుల్లో నిర్మించారు. తమిళ పండుగ ‘పొంగల్‌’ కానుకగా 14-01-1964న తమిళనాడులో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రాన్ని అదే సంస్థ తెలుగులోకి అనువదించి 09-04-1964న ఆంధ్రదేశంలో విడుదల చేసింది. ఇందులో కృష్ణుడుగా ఎన్‌.టి.రామారావు, కర్ణుడుగా శివాజి గణేశన్‌ నటించగా అశోకన్‌ (దుర్యోధనుడు), ముత్తురామన్‌ (అర్జునుడు), సావిత్రి (భానుమతి), దేవిక (శుభాంగి), ఎం.వి.రాజమ్మ (కుంతి), జయంతి (ద్రౌపది) ఇతర పాత్రలు పోషించారు. ఈ భారీ చిత్రనిర్మాణంలో యుద్ధ సన్నివేశాలను కురుక్షేత్రలో, ఇతర ముఖ్య సన్నివేశాలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిత్రీకరించారు. చిత్రానికి మాటలు తమిళంలో టి.కె. కృష్ణస్వామి రాయగా, తెలుగులో డి.వి.నరసరాజు రాశారు. తమిళంలో కణ్ణదాసన్‌ పాటలు రాయగా తెలుగులో సి.నారాయణరెడ్డి రాశారు. సంగీతం విశ్వనాథన్‌-రామమూర్తి సమకూర్చగా, తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌కు గోవర్ధన్‌ సహకారం అందించారు. రెండు వర్షన్లు శతదినోత్సవం చేసుకోవడమే కాకుండా తమిళ వర్షన్‌కు జాతీయ బహుమతి లభించింది.


ఎన్‌.టి. రామారావుకు కె.వి.శ్రీనివాసన్‌ తమిళంలో డబ్బింగ్‌ చెప్పారు. భారతీయ సైన్యం సేవలు ఉపయోగించుకుంటూ 80 ఏనుగులు, 400 గుర్రాలతో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.ఈ చిత్రంలో శివాజీ గణేశన్, దేవికకు ‘ఇరవుం నిలవుం వళరత్తుమే నమ్‌ ఇనిమై నినైవుగళ్‌ తొడరత్తుమే’ అనే యుగళ గీతం వుంది. తమిళంలో ఆ గీతాన్ని టి.ఎం.సౌందర్‌ రాజన్, సుశీల పాడగా, తెలుగులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సుశీల ఆలపించారు. ఈ పాటలో వినిపించే షెహనాయి బిట్స్‌ని ఇద్దరు మేధావుల చేత వాయింపజేయడం విశ్వనాథన్‌ - రామమూర్తిలు చేసిన అద్భుత ప్రయోగంగా ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఆ షెహనాయి వాయించిన వారిలో మొదటివారు బొంబాయికి చెందిన ప్రసిద్ధ షెహనాయి విద్వాంసులు రామ్‌ లాల్‌ కాగా, రెండవ వారు దక్షిణ భారత ప్రఖ్యాత షెహనాయి వాద్యకారులు సత్యం. వీరిని ‘షెహనాయి సత్యం’ అని కూడా పిలుచుకుంటారు. ప్రఖ్యాత దర్శక నిర్మాత వి.శాంతారాం నిర్మించిన ‘శెహరా’ (1963) చిత్రానికి రామ్‌ లాల్‌ సంగీతం సమకూర్చారు. అందులో లతాజీ పాడగా సంధ్య మీద చిత్రీకరించిన ‘ఓ...పంఖ్‌ హోతే తో వుడ్‌ ఆతి రే, రసియా ఓ జాలిమా తుజ్హే దిల్‌ కా దాగ్‌ దిఖ్లాతీ రే’ అనే పాట నేటికీ వినిపిస్తూనే వుంటుంది. అలాగే విజయ భట్‌ నిర్మించిన ‘గూంజ్‌ ఉఠీ షెహనాయీ’ చిత్రంలో బిస్మిల్లా ఖాన్‌తో కలిసి షెహనాయి వాయించిన కళాకారుడు రామ్‌ లాల్‌. ఇక షెహనాయి సత్యం దక్షిణ భారత దేశంలో పేరుమోసిన షెహనాయి విద్వాంసుడు. విజయావారి ‘గుండమ్మ కథ’ సినిమా టైటిల్‌ సంగీతంతోబాటు ఎల్‌. విజయలక్ష్మి నాట్యానికి షెహనాయి వాయించింది సత్యం. అలా ఇద్దరు ప్రముఖ విద్వాంసుల చేత ‘కర్ణన్‌’ చిత్రంలో షెహనాయి వాద్య పరికరాన్ని వాయింపజేయడం ఒక గొప్ప ప్రయత్నంగా సంగీత దర్శకులు విశ్వనాథన్‌ - రామమూర్తిలను అభినందించాలి. తరువాతి కాలంలో పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా చేత ‘శ్రీశ్రీ మర్యాదరామన్న’ (ఏమి ఈ వింత మొహం), ‘సిరివెన్నెల’ (విధాత తలపున ప్రభవించినది) చిత్రాలలో ఫ్లూట్, అలాగే ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలో సజ్జాద్‌ హుసేన్‌ చేత మాండలిన్‌ బిట్లు సంగీత దర్శకులు కోదండపాణి, మహదేవన్‌లు వాయింపజేసి మంచి ఫలితాలు రాబట్టారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.