కిషోర్‌కుమార్‌ నాలుగు పెళ్లిళ్ల వెనుక...

ప్రముఖ నటుడు అశోక్‌ కుమార్‌కు బాంబే టాకీస్‌తో విడదీయరాని అనుబంధం వుంది. 1950లో బాంబే టాకీస్‌ తరఫున అశోక్‌ కుమార్‌ తన మిత్రుడు నితిన్‌ బోస్‌ దర్శకత్వంలో ‘మషాల్‌’ అనే చిత్రాన్ని హిందీ, బెంగాలీ భాషల్లో నిర్మించారు. ఆ సినిమాలో రూమా గుహ అనే అమ్మాయి నటించింది. ఆ సమయంలో అశోక్‌ సోదరుడు కిషోర్‌ కుమార్, రూమా గుహతో ప్రేమలో పడ్డారు. అన్నయ్యకు తెలిస్తే ఒప్పుకోడేమోననే భయంతో కిషోర్‌కుమార్, రూమాను ఎవరికీ తెలియనీయకుండా 1951లో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నాడు. అశోక్‌ కుమార్‌ ఇంటిలోనుంచి బయటకు వచ్చేసి వేరు కాపురం పెట్టాడు. అయితే కిషోర్‌ చాదస్తాన్ని రూమా గుహ భరించలేకపోయేది. పెళ్ళయిన మొదటి రాత్రి ‘‘మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నువ్వు వెంటనే గర్భవతివైతే పెళ్ళికి ముందే ఇద్దరం శారీరకంగా కలిశామనుకుంటారు. కాబట్టి ఏడాది వరకు సంసార సుఖానికి దూరంగా వుందాం’’ అన్నాడు. నిజానికి తన కెరీర్‌ దెబ్బతింటుందేమో అనేది అసలు భయం. ఇలాంటి అభిప్రాయాలతో పాటు కిషోర్‌ ఆలోచనా విధానం, ప్రవర్తన కూడా రుమాకు నచ్చలేదు. ముభావంగా వుండేది. మార్చడానికి ప్రయత్నించింది. ‘‘నీకు మాట్లాడడం చేతకాదు. ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలియదు. నేను నేర్పుతాను... నేర్చుకో’’ అంటూ కాస్త నిర్మొహమాటంగా చెప్పింది. దీంతో కిషోర్‌కు ఒళ్ళు మండింది. రూమాకు దూరంగా మెలగడం ఆరంభించాడు. అన్న అశోక్‌ కుమార్‌కు కిషోర్‌ కుమార్‌కు మధ్య 18 ఏళ్ళు తేడా. బాగా గారాబంగా పెరిగాడు. అల్లరి పిల్లాడుగా పేరుతెచ్చుకున్నాడు. అదే పసివాడి మనస్తత్వం కిషోర్‌కు పెళ్లయ్యాక కూడా మారకపోవడం రూమాకు ప్రతిబంధకమైంది. పెళ్ళయిన రెండేళ్ళకి వారికి అమిత్‌ కుమార్‌ పుట్టాడు. అయినా వారి సంసార జీవనంలో పెద్ద మార్పేమీ రాలేదు. అలా రూమా-కిషోర్‌ కుమార్‌ కలిసి ఐదేళ్లు సంసార జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఆ యాంత్రిక జీవనాన్ని రూమా భరించలేకపోయింది. ఆ ఇంటిని, భర్తను వదలి కొడుకు అమిత్‌కుమార్‌తో సహా కలకత్తా వెళ్లిపోయింది. అతణ్ణి కలకత్తాలోనే చదివించింది. అమిత్‌ మాత్రం సెలవుల్లో తండ్రి వద్దకు వచ్చేవాడు. తర్వాత రూమా మరొకరిని పెళ్లాడడంతో అమిత్‌ తండ్రి వద్దనే వుండిపోయాడు. కిషోర్‌ కుమార్‌ తరువాత మధుబాలను వివాహం చేసుకున్నాడు. 1969లో ఆమె మరణానంతరం నటి యోగితా బాలిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. చివరగా నటి లీనా చందావర్కర్‌ను 1980లో కిషోర్‌ వివాహం చేసుకున్నాడు. 1987లో చనిపోయేవరకు ఆమెతోనే కాపురం చేశాడు. అమిత్‌ కుమార్‌ పెళ్లి విషయంలో రూమా తలదూర్చడం కిషోర్‌ కుమార్‌కు తలపోటు తెప్పించింది. ఆ మనోవేదనతో గుండెనొప్పి వచ్చింది. లీనా చందావర్కర్‌ చేతుల్లోనే కిషోర్‌ తనువు చాలించాడు. అలా...రూమా ఉదంతంతో కిషోర్‌ నిర్మించిన చిత్రమే ‘దూర్‌ గగన్‌కి ఛావోమ్‌ మే’.


- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.