అలా ‘మేఘాలు లేకున్నా’ ఇద్దరు రాశారు


పాట మనసుకు నచ్చితే రాసిందెవరు, పాడిందెవరు? అని చాలామంది ఆరా తీస్తుంటారు. అందుకే క్యాసెట్లు, సీడీలు, డిజిటల్‌ మాధ్యమాల్లో పాట, సాహిత్యం, సంగీతం, గానం వివరాలు ప్రచురిస్తారు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం వివరాల్లో ఇద్దరి రచయితల పేర్లు కనిపిస్తాయి. దాంతో ఆ పాటను ఇద్దరు ఎలా రాస్తారు? అనే సందేహం రావడం సహజం. అలాంటి పరిస్థితి ఎందుకొస్తుందో ఓ సందర్భంలో చెప్పారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌. ‘కుమరి 21ఎఫ్‌’ చిత్రంలోని ‘మేఘాలు లేకున్నా’ పాట విషయంలో ఆయనకు ఇదే పరిస్థితి ఎదురైంది. అలా ఎందుకు జరుగుతుందో ఆయన మాటల్లోనే.. ‘‘పాటను పంచుకోవడం అంటే ఇద్దరు రచయితలు కలిసి రాయడం అనుకుంటారు. కానీ అలా జరగదు. పాటను ముందు ఒక రచయితతో రాయిస్తారు. అందులో కొన్ని పదాలు దర్శకుడు, సంగీత దర్శకుడికి నచ్చుతాయి, కొన్ని నచ్చవు. దాంతో ఆ పాట బావుందని చెప్పలేరు, బాలేదు అని వ్యక్తం చేయలేరు. అలా మరొకరితో రాయించి నచ్చిన పదాలు తీసుకుంటారు. ‘మేఘాలు లేకున్నా’ పాటకు పల్లవి శ్రీమణి రాశారు, చరణం కుదరడం లేదని నన్ను రాయమన్నారు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌. శ్రీమణికి ఫోన్‌ చేస్తే ఫర్వాలేదు రాయమని చెప్పారు. చరణంతోపాటు దానికి సరితూగే నాలుగైదు పల్లవులు రాశాను. వాటిలో మేఘాలు లేకున్నా చరణం డీఎస్పీకి బాగా నచ్చింది. దాంతో నేను రాసిన చరణం, శ్రీమణి రాసిన పల్లవి తీసుకున్నారు. అంతేకానీ మీరు చరణం రాయండి, మీరు పల్లవి రాయండి అని ముందే చెప్పరు. కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంటుంది’’. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్‌ నటించిన ఈ పాట శ్రోతల్ని బాగా అలరించింది. యాజిన్‌ నైజర్‌ ఆలపించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.