మాధురి దీక్షిత్‌ నో చెప్తే అమల ఓకే చేసింది

‘పుష్పక విమానం’.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ ప్రయోగం. ఓ సంచలనం. ఓ అద్భుతం. నటీనటులకు ఇదొక సాహసం. కారణం మాటల్లేకుండా కేవలం హావభావాలతోనే నడిచే కథ కావడం. కమల్‌ హాసన్, అమల జంటగా వచ్చిన ‘పుష్పక విమానం’ ప్రేక్షకుల్ని ఆశ్చర్యాకాశంలో ఎలా విహరింపజేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో అమల అందం, అభినయం ప్రతి ఒక్కరిని ఫిదా చేశాయి. అమల స్థానంలో బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ అయితే ఎలా ఉండేది? ఎందుకంటారా.. ఎందుకంటే ఈ చిత్రంలో ముందుగా అనుకున్న కథానాయిక ఆమెనే. నాయిక అన్వేషణలో ఉన్న సింగీతానికి.. పరిచయమున్న వ్యక్తి కలిసి ఓ అమ్మాయి ఉంది, కొన్ని సినిమాలు చేసింది కానీ అవి విడుదల కాలేదు. ఐరన్‌లెగ్‌ వంటి సింటిమెంట్‌ మీకు లేకపోతే తీసుకోండని సలహా ఇచ్చారట. ఆ అమ్మాయే మాధురి. దాంతో మాధురి పి.ఎ.ని సంప్రదించారు శ్రీనివాసరావు. మాటలు లేని సినిమాలో మాధురి నటించదని పి.ఎ. సమాధానం ఇచ్చాడు శ్రీనివాసరావుకి. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో అమలని చూసిన సింగీతం ఆ పాత్రకు చక్కగా సరిపోతుందని భావించి ఈ చిత్రంలో ఎంపిక చేశారు. అలా మాధురి వద్దన్న సదవకాశం అమలకు దక్కింది. అందరి ప్రశంసలు పొందింది. సినిమా విడుదలైన కొంతకాలానికి విషయం తెలుసుకున్న మాధురి ‘‘ఎవడు వాడు?మంచి అవకాశం పోగొట్టాడ’’ని బాధపడింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.