
ప్రముఖ నటుడు కృష్ణ తనయ, మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాతగా, నటిగా సుపరిచితమే. మరి కథానాయికగా? ఆ అవకాశం వచ్చింది కానీ కాలేకపోయింది. ఏ సినిమాలో, ఎందుకంటే.. బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘టాప్‌హీరో’ గుర్తుంది కదా! ముందుగా ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు మంజులనే ఎంపిక చేసింది చిత్ర బృందం. అయితే కృష్ణ అభిమానులు ఇందుకు ఒప్పుకోలేదు. మంజుల నటిస్తే ఊరుకోం అని కృష్ణ కార్యాలయానికి వెళ్లి గొడవ చేశారు. ఈ విషయంపై కృష్ణ అధికారిక ప్రకటన ఇచ్చే వరకూ వాళ్లు అక్కడి నుంచి కదల్లేదు. ‘‘వాళ్ల సోదరిని, ఇంటి ఆడపడుచుని అనుకుని నేను నటించేందుకు అడ్డు చెప్పారంతే. అంతకు మించి ఏం లేద’’ని ఓ సందర్భంలో జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది మంజుల. అదన్న మాట సంగతి. అభిమానులు వద్దనడంతో కథానాయికగా పరిచయం కాలేకపోయింది. ఆ తర్వాత ‘షో’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఆరెంజ్’ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకురాలుగానూ మారారు. అలా మంజుల నో చెప్పడంతో ఆమె స్థానంలో సౌందర్యను తీసుకున్నారు.