గుమ్మడి కాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలనేది నానుడి. కొందరి నాయికల కెరీర్ విషయంలో దీన్ని అనువయించుకోవచ్చు. నటన పరంగా వందశాతం టాలెంట్ చూపించినా ఆ చిత్రాలు ఆశించిన ఫలితం అందుకోకపోతే బాధే కదా. అయినా విశ్రమించకుండా తనేంటో నిరూపించుకుంది తెలుగమ్మాయి చాందినీ చౌదరి. ఇప్పుడంటే ‘కలర్ ఫొటో’ భామ అంటారు కానీ అంతకు ముందూ కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు పోషించి మెప్పించింది. ‘మను’ ‘హౌరా బ్రిడ్జ్’ తదితర చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘కలర్ ఫోటో’కి ముందు కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆమె వద్దకు వచ్చాయట. అదే సమయంలో చాందినీ ఓ ప్రముఖ నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో రెండేళ్లపాటు వేరే సినిమాల్లో నటించే అవకాశం లేకుండా పోయింది. వాటిలో ‘కుమారి 21 ఎఫ్’, ‘పటాస్’ చిత్రాలున్నాయి. ఈ రెండూ బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్నాయి. మరి వీటిలో నటించి ఉంటే చాందినీ కెరీర్ మరో స్థాయిలో నిలిచేది.