తొలి తెలుగు హాస్య నటుడు కారు డిక్కీలో శవంగా!!

స్తూరి శివ‌రావు హాస్య‌న‌టు‌డిగా ఎంతో ప్రసి‌ద్ధి‌కె‌క్కాడు.‌ మూకీ చిత్రా‌ల‌ప్పుడు వ్యాఖ్యా‌త‌గానూ, ప్రొజె‌క్టరు ఆప‌రే‌ట‌రు‌గానూ, రంగ‌స్థల నటు‌డి‌గానూ ఉండి, నిదా‌నంగా సినిమా నటు‌డిగా స్థిర‌ప‌డ్డాడు.‌ సినిమా నటుల్లో మాస్‌ ఫాలో‌యింగ్‌ సంపా‌దిం‌చు‌కున్న మొదటి నటుడు అతనే కావచ్చు.‌ 1948లో ‌‘బాల‌రాజు’‌ విడు‌దలై ఘన‌వి‌జయం సాధిం‌చింది.‌ కొన్ని థియే‌ట‌ర్లలో సంవ‌త్సరం పాటు ఆడింది.‌ అక్కి‌నేని హీరో, శివ‌రావు హాస్య పాత్రధారి.‌ నూరు‌రో‌జుల పండ‌గ‌లకి, ఊళ్లు వెళ్తే వేలాది మంది శివ‌రా‌వును చుట్టు‌ము‌ట్టే‌వారు.‌ ‌‘నేను హీరోనే అయినా నన్ను చూడ్డా‌నికి వచ్చి‌న‌వాళ్లు, శివ‌రావు కని‌పిస్తే అటు పరు‌గె‌త్తే‌వారు’‌ అని నాగే‌శ్వ‌ర‌రావు ఓసారి చెప్పారు.‌ తర్వాత శివ‌రావు పెద్ద‌స్టారు.‌ చేతి నిండా సిని‌మాలు.‌ షూటిం‌గు‌లకి రావడం గగ‌న‌మై‌పో‌యేది.‌ అప్ప‌ట్లోనే ‌‘ట్రబుల్‌ సమ్‌ ఆర్టిస్ట్‌’‌ అని అని‌పిం‌చు‌కున్నా, నిర్మా‌తలు శివ‌రా‌వుని కోరు‌కోక తప్ప‌లేదు.‌ మద్రా‌సులో ఇల్లు కట్టు‌కు‌న్నాడు.‌ పెద్ద విదేశీ కార్లో తిరి‌గే‌వాడు.‌ సొంతంగా ‌‘పర‌మా‌నం‌దయ్య శిష్యులు’‌ (1950) చిత్రా‌నికి దర్శ‌కత్వం వహించి, నిర్మిం‌చాడు.‌ ప్రేక్ష‌కులు బాగానే వినో‌దిం‌చారు.‌ రాను‌రాను శివ‌రా‌వుకి సిని‌మాలు తగ్గాయి.‌ మరి సంపా‌దిం‌చు‌కు‌న్న‌దంతా ఏమైందో తెలీదు.‌ తాను విదేశీ కారులో తిరి‌గిన అదే పాండీ బజార్లో, చివరి దశల్లో డొక్కు సైకిలు మీద తిరి‌గాడు! జీవ‌నో‌పా‌ధికి నాట‌కాలు వేసు‌కు‌నే‌వాడు.‌ అలాగే తెనాలి నాట‌కా‌నికి వెళ్లి అక్కడే మర‌ణిం‌చాడు.‌ మూడు రోజుల తర్వాత శివ‌రావు దేహం మద్రాసు చేరు‌కుంది.‌ కారు డిక్కిలో వేసి తీసు‌కొ‌చ్చారు.‌ తారగా వెలి‌గి‌న‌పుడు వేలా‌ది‌మం‌దిని తన వెంట తిప్పు‌కున్న శివ‌రావు అంతి‌మ‌యాత్ర హృదయ విదా‌రకం! అతని వెంట శ్మశా‌నికి వెళ్లిన వాళ్లు ఆరు‌గురు కూడా లేరు! ఇలా జర‌గ‌డా‌నికి కారణం సృయం‌కృ‌తా‌ప‌రా‌ధమా? ఒక్కో‌సారి కార‌ణాలు తెలి‌యవు.‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.