‘సాహసం చేయరా డింభకా.. రాజకుమారి దక్కేను’ అన్నది ‘పాతాళభైరవి’ చిత్రంలో మాంత్రికుడు ఎస్వీఆర్ డైలాగ్. కానీ ‘సాహసం చేయడం అన్ని వేళలా మంచింది కాద’ని డైలాగ్‌కింగ్ మోహన్‌బాబు హితబోధ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఈ మాట ఎందుకన్నారు? ఆయన మాటల్లోనే తెలుసుకొందాం. ‘‘నా చిన్నబ్బాయి మనోజ్ కొన్ని సినిమాల్లో రిస్క్‌లు ఎక్కువ చేశాడు. అప్పట్లో వచ్చిన ‘బిందాస్’, ‘మిస్టర్ నోకియా’..ఇవన్నీ చూసినప్పుడు.. భవిష్యత్తులో ఇంకేం చేస్తాడో అనే భయం వేసేది. రిస్క్‌లు చేయడం అన్నిసార్లు మంచిది కాదు. ఒకోసారి అవి మన జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. అప్పట్లో నేను కూడా మనోజ్‌లా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించేవాడిని. 1976 నాటి మాట. మనోజ్‌లా నేను కూడా ఉడుకు రక్తంతో ఓ సినిమా కోసం రిస్కీగా గాల్లోకి ఫైట్ చేశా. బాలెన్స్ తప్పి కింద పడ్డా. కాలు విరిగింది. అడుగుతీసి అడుగేయలేను. అంతే..నో షాట్, నో.. కెమెరా. కాలుకి కట్టేయాలి. పుత్తూరు వెళ్లాలి. కానీ నాకు సొంత కారు లేదు. నిర్మాతను అడిగితే ఇవ్వలేదు. తరువాత ఎలాగో ఇచ్చాడులెండి. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోమన్నారు. వేషాలు తగ్గాయి. మునుముందు కూడా అవకాశాలు రావేమోనని భయపడ్డాను. ఆ బాబా దయవల్ల వేషాలొచ్చాయి. కెరీర్ దూసుకెళ్లింది. ఆ తరువాత ఎప్పుడూ రిస్క్‌ల జోలికి వెళ్లలేదు. కాబట్టే ఇప్పటికీ ఐదువందల యాభైపై చిలుకు చిత్రాలు చేయగలిగా..అంటూ గతం గుర్తు చేసుకొన్నారు.
