నితిన్‌... 18 యేళ్ల‌లో ఒక్క‌సారే!

26 సినిమాలు... 18 యేళ్లు. ఇదీ  నితిన్ ట్రాక్ రికార్డ్‌. ఆయ‌న తొలి సినిమా `జ‌యం` ప్రేక్ష‌కుల ముందుకొచ్చి  ఈ నెల 14తో 18 యేళ్లు  పూర్త‌వుతాయి.  తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఆ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో,  వెనుదిరిగి చూసుకునే అవ‌స‌రం లేకుండా నితిన్ కెరీర్ ముందుకు సాగింది.  కె.రాఘ‌వేంద్ర‌రావు, రాజ‌మౌళి వంటి అగ్ర ద‌ర్శ‌కులు మొద‌లుకొని... కొత్త ద‌ర్శ‌కుల వ‌ర‌కు  అంద‌రితోనూ క‌లిసి ప‌నిచేశాడు నితిన్.  అయితే ఎంత మంచి హిట్లున్నాయో, అంత‌టి డిజాస్ట‌ర్లు  కూడా ఆయ‌న కెరీర్‌లో ఉన్నాయి. వ‌రుస‌గా ప‌ది సినిమాల‌కి పైగా ఫ్లాపులు ఆయ‌న కెరీర్‌లో ఉన్నాయి.  ప‌డిలేచిన కెర‌టంలా ఆయ‌న `ఇష్క్‌`, `గుండెజారి గ‌ల్లంత‌య్యిందే` సినిమాల‌తో  మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టాడు.  త్వ‌ర‌లోనే 18 యేళ్ల సినీ ప్ర‌యాణం పూర్తి చేసుకుంటున్న నితిన్ కెరీర్‌కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  త‌న‌ని ప‌రిచ‌యం చేసిన తేజ‌తో త‌ప్ప ఇప్ప‌టిదాకా ఏ ద‌ర్శ‌కుడితోనూ ఆయ‌న రెండోసారి క‌లిసి ప‌నిచేయ‌లేదు. ప్ర‌తిసారీ ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తూ  ప్ర‌యాణం సాగించారు. అయితే త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న `ప‌వ‌ర్ పేట‌`తో  రెండోసారి ద‌ర్శ‌కుడు రిపీట్ కాబోతున్నాడు. `ప‌వ‌ర్ పేట‌` సినిమాకి కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. కృష్ణ  చైత‌న్య ఇదివ‌ర‌కు నితిన్‌తో క‌లిసి `ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌` చేశారు.  మంచి స్నేహితులైన ఈ ఇద్ద‌రూ క‌లిసి త్వ‌ర‌లోనే `ప‌వ‌ర్ పేట‌` చేయ‌బోతున్నారు. 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.