చిరు ‘భగత్‌ సింగ్‌’ కల.. ‘సైరా’గా మారిన వేళ!!

‘సైరా’.. ఈ పేరు వినగానే సినీప్రియుల మదిలో మెదిలే తొలి మాట ఒకటే. ‘ఇది చిరంజీవి కలల ప్రాజెక్టు’. ఇదే మాటను చిరంజీవి అనేక సార్లు అనేక వేదికలపై చెప్పారు. ఆయన తనయుడు రామ్‌చరణ్‌ సైతం అనేక కార్యక్రమాల్లో బయటపెట్టారు. కానీ, వాస్తవమేంటంటే చిరు అసలైన కలల ప్రాజెక్టు ఇది కాదట. రెండు దశాబ్దాల క్రితం ఆయన మదిలో మెదిలిన డ్రీమ్‌ ప్రాజెక్టు స్వాతంత్య్ర సమరయోధుడు ‘భగత్‌ సింగ్‌’ జీవితగాథ అç. తాజాగా బిగ్‌బితో కలిసి ఫర్హాన్‌ అక్తర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరు ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘ప్రతి నటుడు ప్రేక్షకుల్ని రంజింప చేయడానికి కొన్ని తరహా పాత్రలు చేస్తాడు. మరికొన్ని పాత్రలు తన ఆత్మసంతృప్తి కోసం చేస్తుంటాడు. అలా నాకూ ఓ కోరిక ఉండేది. ఎప్పటికైనా ఓ స్వాతంత్య్ర సమరయోధుడి కథలో నటించాలని అనుకుంటుండే వాడిని. అలా రెండు దశాబ్దాల క్రితం నేను కచ్చితంగా చేసి తీరాలని ఎదురు చూసిన పోరాట యోధుడు ‘భగత్‌ సింగ్‌’. ఆయన పాత్రను పోషించాలని చాలా కోరిక ఉండేది. కానీ, దురదృష్టవశాత్తూ ఎవరూ ఆయన కథతో నా దగ్గరకు రాలేదు. కానీ, పన్నెండేళ్ల క్రితం నా కలకు పరుచూరి బ్రదర్స్‌ ఓ సమాధాన్ని అందించారు. తమ వద్ద తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఉందని. సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే బ్రిటిష్‌ వారిపై పోరుకు సై అన్న తొలి పోరాట వీరుడని ఆయన కథను వివరించారు. అది వినగానే నాకు చాలా బాగా నచ్చేసింది. చరిత్రలో కనిపించని ఆ వీరుడి గాథ దేశ పౌరులకు చూపించాలని అనిపించింది. ఇక అప్పటి నుంచి ‘సైరా’ నా కలల ప్రాజెక్టుగా మారిపోయింది. కానీ, అప్పటికి నా మార్కెట్, బడ్జెట్‌ పరిమితుల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కిండం సాధ్యపడలేదు. ఆ తర్వాత నేనూ రాజకీయాల్లో బిజీ అయిపోయా. కానీ, ‘బాహుబలి’ చిత్ర ఫలితం ‘సైరా’పై ఆశలు చిగురించేలా చేసింది. తెలుగు చిత్రసీమ మార్కెట్‌ ఎలాంటిదో తెలియజేసింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే’’ అంటూ తన కలల ప్రాజెక్టు తెర వెనక సంగతులను పంచుకున్నారు చిరు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.