‘పాతాళభైరవి’ మాలతి పతనం దయనీయం

మాలతి.... ఆ పేరు వినగానే గుర్తుకొచ్చేది ‘పాతాళభైరవి’ సినిమాలో హీరోయిన్‌. ఇంకొంచెం వెనక్కు వెళితే వాహినీ వారి ‘సుమంగళి’ (1940) చిత్రంలో ఆమె పాడిన ‘‘వస్తాడే మాబావ’’ పాట ఏళ్ళ తరబడి ప్రేక్షకుల పెదవులమీద నాట్యం చేసింది. ఆమెది సహజమైన అందం, అభినయం. ఆరోజుల్లో మాలతి పాడిన ‘‘నీలాల రంగువాడు’’, ‘‘ఊగాలి ఉయ్యాల’’లాంటి ప్రైవేటు గీతాలు ఇళ్ళలోని గ్రామఫోనుల్లో వినపడుతూ వుండేవి. ఆమె ‘వస్తాడే మాబావ’ పాటలో నటిస్తున్నప్పుడు ఒకానొక సన్నివేశంలో గుండ్రంగా తిరగాల్సి వచ్చింది. ఎందుకో దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఆ షాట్‌ను చాలాసేపు చిత్రీకరిస్తూ మాలతిని గుండ్రంగా తిరగమంటూనే వున్నారు. పాపం ఆమెకు కళ్ళుతిరిగాయి. సెట్లోనే తలతిరిగి పడిపోయింది. అలా చాలాసేపు విశ్రాంతి తీసుకొని ఆ షాట్‌ను ఓకే చేయించుకుంది. ఇది ఆమె పట్టుదలకు, అంకితభావానికి ఒక ఉదాహరణ మాత్రమే! ‘సుమంగళి’ చిత్రంలో పార్వతి పాత్రలో అద్భుతంగా రాణించిన మాలతికి తరువాతి కాలంలో పెద్దగా అవకాశాలు రాలేదు. ఏ.వి.మెయ్యప్పన్‌ ‘భక్తచేత’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించి అందులో మాలతిని హీరోయిన్‌గా బుక్‌ చేసి అగ్రిమెంటు రాయించారు. అనివార్యకారణాల వలన ఆ సినిమా నిర్మాణానికి నోచుకోలేదు. ఈ సినిమాను నమ్ముకున్న మాలతి ‘దేవత’ చిత్రంలో అవకాశాన్ని వదలుకోవలసి వచ్చింది. 1941లో వాహినీ పతాకం మీద దర్శకుడు కె.వి.రెడ్డి ‘భక్త పోతన’ చిత్రాన్ని ప్రారంభించారు. అందులో శ్రీనాథుడి కూతురు వేషానికి మాలతిని బుక్‌ చేశారు. ఈ సినిమాలో కాస్త గ్లామర్‌ పాత్ర అదే. తరువాత చిత్తూరు నాగయ్య సొంతంగా రేణుకా పిక్చర్స్‌ బ్యానర్‌ మీద ‘భాగ్యలక్ష్మి’ (1943) సినిమా నిర్మిస్తూ మాలతికి హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని కలిగించారు. వెనువెంటనే స్టార్‌ కంబైన్స్‌ వారు నిర్మించిన ‘మాయా మశ్చీంద్ర’ (1946) చిత్రంలో కూడా మాలతి హీరోయిన్‌గా నటించింది. ఇంత టాలెంట్‌ వున్నా ‘పాతాళ భైరవి’ చిత్రం తరువాత ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. తదనంతర కాలంలో అత్త, అమ్మ పాత్రల్లో నటించాల్సివచ్చింది. జీవిత చరమాంకంలో మాలతి ఒంటరి జీవితం అనుభవించింది. దుర్భర దారిద్య్రాన్ని చవిచూసింది.

పద్మాలయా వారు ‘పాతాళ భైరవి’ (1985) చిత్రాన్ని హిందీలో నిర్మించినప్పుడు ఒకసారి మాలతి బొంబాయి వెళ్లింది. అలనాటి నటి, రేఖ తల్లి పుష్పవల్లిని కలిసి ఆర్ధిక సహాయం కోరింది. పుష్పవల్లి మాలతిని ఆదరించి, భోజనంపెట్టి, కొంత డబ్బు చేతిలో పెడుతూ వుండగా షూటింగుకు వెళ్ళిన రేఖ ఇంట్లోకి అడుగుపెట్టింది. మాలతిని చూసి ఎవరో అనుకొని కాస్త చిరాకుపడుతూ తన గదిలోకి వెళ్లిపోయింది. మాలతి సెలవు తీసుకొని వెళ్లిన తరవాత పుష్పవల్లి రేఖను పిలిచి భోజనం వడ్డించింది. అప్పుడు రేఖ ‘‘అమ్మా ఎవరంటే వాళ్ళని ఇంటికి రానిస్తావు. ఇది బొంబాయి నగరం. జాగ్రత్తగా వుండాలి’’ అంటూ హెచ్చరించింది. పుష్పవల్లి ‘‘ఆమె ఎవరనుకున్నావు? పాతాళభైరవిలో రామారావు సరసన హీరోయిన్‌గా నటించిన మాలతి. పాపం ఆర్థిక పరిస్థితి బాగోలేక సహాయం కోసం వెదుక్కుంటూ వచ్చింది’’ అని చెప్పేసరికి రేఖ చాలా బాధపడింది. ఆమె ఎక్కడుందో తెలియరాలేదు. చివరికి మద్రాసు వెళ్లిపోయిందని తెలిసింది. రేఖకు మద్రాసులో షూటింగ్‌ వుండి అక్కడకు వెళ్లినప్పుడు మాలతిని కలిసి సాయం అందించాలని ప్రయత్నించింది. కానీ మాలతి హైదరాబాదులో వుంటోందని తెలిసింది. తరువాత కొన్నిరోజులకు మాలతి కాచిగూడవద్ద ఒక రేకుల ఇంటిలో వుండగా ప్రక్క ఇంటి గోడ కూలి ఆమె మరణించింది. అక్కడ గుమికూడిన కొందరు ఆ మరణించిన మహిళను ఎవరో అనాధ అనుకున్నారు. కానీ వారిలో కొందరు ఆమెను గుర్తు పట్టి దహనసంస్కారాలకు సాయపడ్డారు. బహుశా అందుకేనేమో గుర్రం జాషువా సత్య హరిశ్చంద్ర నాటకంలో ‘‘తిరమై సంపదలెల్ల నొకరీతిన్‌ సాగిరావు యేరికిన్‌ యేసరికి యేపాటు విధించెనో’’ అని రాశారు. మాలతి విషయంలో అది నిజమైంది!- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.