అందుకే ‘సత్యాగ్రహి’ చేయలేదు


‘ఇడియట్‌’, ‘అతడు’, ‘నేనింతే’.. ఈ హిట్‌ సినిమాలకు పవర్‌స్టార్‌కు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ కథలన్నీ తొలుత పవన్‌ కోసం సిద్ధం చేసినవే. ఇక సెట్స్‌పైకి తీసుకువద్దామని భావించి పవన్‌ వదిలేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. వాటిలో ‘సత్యాగ్రహి’, ‘కోబలి’ ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్‌ తెరకెక్కిద్దామనుకున్న ఈ ‘కోబలి’ ప్రాజెక్టు భవిష్యత్తులో ఎప్పటికైనా తెరపై చూసే ఛాన్సు ఉంది కానీ, ‘సత్యాగ్రహి’ని చూడలేం. ఎందుకంటే ‘సత్యాగ్రహి’ని చాలా ఏళ్ల క్రితమే సెట్స్‌పైకి తీసుకెళ్లి ఆ తర్వాత ఆపేశారట పవన్‌. దీనికి గల కారణాలను పవర్‌స్టార్‌ ఆ మధ్య ఓ కార్యక్రమంలో బయటపెట్టారు. ‘‘చాలా సంవత్సరాల క్రితమే ‘సత్యాగ్రహి’ని మొదలుపెట్టాను. ఆ చిత్ర పోస్టర్‌లో ఓవైపు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్, మరోవైపు చే గువేరా చిత్రాలను పెట్టాను. ఇప్పుడు నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే ఆ చిత్ర కథ. సినిమాల్లో పోరాటం చేసినంత మాత్రాన బయట పనులు జరగడం కష్టం. అందుకే సినిమాలతో పోరాటం చేయడం ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా ఆపేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు కూడా. కానీ, ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా కాబట్టి దాన్ని వదులుకోక తప్పలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

సిక్స్‌ప్యాక్‌ వద్దనుకున్నా

ఇదే కార్యక్రమంలో పవన్‌ మాట్లాడుతూ సినిమాల్లో తానెప్పుడూ సిక్స్‌ప్యాక్‌ ప్రయత్నించక పోవడానికి గల కారణాన్ని వివరించాడు. ‘‘ఇప్పుడు యువతంతా సిక్స్‌ప్యాక్, ఎయిట్‌ప్యాక్‌ కోసం శ్రమిస్తున్నారు. నన్ను చాలా మంది మీరెందుకు ప్రయత్నించలేదని అడుగుతుంటారు. అయితే నాకు వాటిపై ఎప్పుడూ ఆసక్తిలేదు. నేను ధైర్యం అనే బలం కోసం పనిచేసేవాడిని. కండలు పెంచడం చాలా సులువు. అదే గుండె ధైర్యాన్ని పెంచాలంటే చాలా కష్టం. దానికి పిరికితనాన్ని జయించాలి. ఓ రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ ధైర్యం ఎంతో కావాలి’’ అని వివరించారు పవన్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.