అప్పు తచ్చులో పింగళి

సాహితీ సమరాంగణ చక్రవర్తి పింగళి నాగేంద్రరావును గురించి తెలియని సినీ ప్రియులుండరు. 1941లో ఇండియన్ డ్రమటిక్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో వేల్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘తారుమారు & భలేపెళ్లి’ అనే జంట సినిమాలకు పింగళి తొలి రచనా సహకారం అందించారు. ఏడేళ్ళ తరవాత రంగస్థలనటుడు డి.వి. సుబ్బారావు వైజయంతి ఫిలిమ్స్ అనే సంస్థపై పింగళి రచించిన ‘వింధ్యరాణి’ నాటకాన్ని చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో సినిమాగా నిర్మిస్తూ పింగళి చేతనే సంభాషణలు రాయించారు. సినిమా సంక్రాంతి కానుకగా 14 జనవరి 1948న విడుదలైంది. అయితే ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. దాంతో పింగళి బందరు వెళ్ళిపోయారు. ఆ సమయంలో పింగళి సహచర మిత్రుడు కమలాకర కామేశ్వరరావు పింగళిని మద్రాసుకు తీసుకొనివచ్చి వాహినీ సంస్థ అధిపతులు బి.ఎన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, కె.వి.రెడ్డిలకు పరిచయం చేశారు. అప్పుడే వాహినీ వారికి కె.వి. రెడ్డి దర్శకత్వంలో ఒక జానపద చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనవచ్చి సముద్రాల ఇతర సినిమాల రచనలో బిజీగా వుండడంతో కొత్త రచయితను తీసుకుందా మనుకున్నారు. అలా కమలాకర కామేశ్వరరావు పరిచయం చేసిన పింగళికి కబురెళ్ళింది. కె.వి.రెడ్డి అల్లిన ‘గుణసుందరి’ కథకు పింగళి సంభాషణలు, పాటలు రాశారు. సినిమా 29 డిసెంబరు 1949న విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. జనం విరగబడి చూశారు. ప్రేక్షకుల కోరికమేరకు రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శిస్తే తెల్లారిపోయేది. ఇందులో పింగళి రాసిన ‘శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే’ (శ్రీరంజని), ‘ఉపకార గుణాలయవై’ (లీల), ‘ఈవనిలో కోయిలనై’ (టి.జి. కమలాదేవి) పాటలు మహిళాలోకానికి ప్రీతిపాత్రమై వెలిగాయి. పింగళి కస్తూరి శివరావుతో పలికించిన ‘గిడి గిడి’ అనే ఊతపదం బాగా ప్రాచుర్యం పొందింది. విజయా సంస్థ ఏర్పడిన తరువాత పింగళి అందులో ఆస్థాన రచయితగా నిలబడిపోయారు. ముఖ్యంగా దర్శకుడు కె.వి. రెడ్డితో పింగళి మైత్రీబంధం ‘గుణసుందరి కథ’ చిత్రంతో బలపడింది. విజయా సంస్థతో పింగళి బంధం 1950 నుండి 1971 వరకు అప్రతిహతంగా సాగింది. పింగళి రచించిన ‘పాతాళభైరవి’ (1951) సూపర్ హిట్‌గా నిలిచి 28 కేంద్రాలలో శతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. రంగారావు చేత పలికించిన ‘‘సాహసం శాయరా...రాజకుమారి లభిస్తుందిరా’’, ‘’ఏ డింభకా’’... ‘’హే బుల్ బుల్’’... ‘’ఏ డింగరీ’’ అనే మాటలు, పద్మనాభం చేత పలికించిన ‘‘ఏం గురూ’’, ‘‘మోసం గురూ’’ అనే ఊతపదాలు, హీరో రామారావు చేత పలికించిన ‘‘నిజం చెప్పమన్నారా... అబద్ధం చెప్పమన్నారా’’ అనే ఉడికింపు మాట, పాతాళభైరవిగా గిరిజ చేత పలికించిన’ ‘’రుడా ఏమి నీ కోరిక’’ అనే మాట ప్రేక్షకులలోకి దూసుకొని వెళ్ళాయి. తరువాత ‘పెళ్ళిచేసిచూడు’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’, ’పెళ్లినాటి ప్రమాణాలు’, అప్పుచేసి పప్పుకూడు’, ‘మహాకవి కాళిదాసు’, ‘జగదేకవీరుని కథ’, ‘గుండమ్మ కథ’ వంటి సినిమాలు పింగళి స్థాయిని ఆకాశానికి పెంచేశాయి. 1971లో తన ప్రియ మిత్రుడు కె.వి.రెడ్డి మరణాన్ని పింగళి జీర్ణించుకోలేక మరింత వేదనకు గురయ్యారు. దీంతో పింగళికి క్షయవ్యాధి సోకింది. అంతకు ముందు వున్న వుబ్బస వ్యాధి తిరగబెట్టి మే నెల 6, 1971న ఆ ఘోటక బ్రహ్మచారి దివంగతులైనారు. అసలు విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. పింగళి చనిపోయిన వార్తను ఒక ప్రముఖ దినపత్రిక (పేరు చెప్పడం లేదు) ప్రముఖంగా ప్రకటిస్తూ పొరబాటున పింగళి నాగేంద్రరావు ఫోటోకి బదులుగా చక్రపాణి ఫోటో పెట్టింది. పేపర్ చదివిన సినీ విమర్శకులు భమిడిపాటి రామగోపాలం వెంటనే ఆ పత్రిక కార్యాలయానికి ఫోనుచేసి పత్రికలో దొర్లిన పొరబాటును సంపాదకునికి వివరించారు. సంపాదకుడు విచారం వ్యక్తపరుస్తూ మరుసటి సంచికలో సవరణ ప్రచురిస్తానని, చక్రపాణికి క్షమాపణలు చెబుతానని తెలిపారు. భమిడిపాటికి చక్రపాణి పరిచయం వుండడంతో చనువుకొద్దీ ఈ విషయాన్ని ఆయనకు కూడా చేరవేశారు. దానికి చక్కన్న తనదైన శైలిలో జవాబిస్తూ ‘’ఆళ్లు సరిగ్గానే యేశారులే. ఎందుకంటే ఆడుబోతే నేను పోయినట్టేగా’’ అన్నారు. అదండీ పింగళి, చక్రపాణి మధ్య వున్న అనుబంధం, ఆప్యాయత.

 చక్రపాణి


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.