అనుకున్నదొకటి.. ఖరారైంది మరొకటి!!

చిత్రాలు వేగంగా తెరకెక్కించడంలో అగ్రగామి దర్శకుడు పూరి జగన్నాథ్‌. సినిమా ప్రకటించిన త‌క్కువ వ్యవధిలోనే చిత్రీకరణ పూర్తి చేయగలరాయన. ఎన్ని రోజులు షూట్‌ చేశామన్నది కాదు హిట్‌ కొట్టామా? లేదా? అనేది ఆయన పంథా. పూరి కథలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో.. అందులో కథానాయకుడి పాత్ర అంతకన్నా వైవిధ్యంగా ఉంటుంది. ఆయన రాసిన డైలాగ్స్‌ ఎంత కిక్కిస్తాయో.. టైటిల్స్‌ అంతకన్నా ఆకర్షిస్తాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాల టైటిల్స్‌ అన్నీ ప్రేక్షకుల నోళ్లలో ఎప్పుడూ నానుతూనే ఉంటాయి. దానికి కారణం ఆయన కథకు తగిన పేరు ఎంచుకోవడమే. అయితే.. కొన్ని సందర్భాల్లో ఓ కథకు ఫలానా పేరు పెట్టాలనుకున్నా విడుదల సమయానికి మరో పేరు ఖరారవుతుందనే విషయం తెలిసిందే. పూరికి సైతం ఈ అనుభవం ఎదురైంది. అవి ఏ సినిమాలు, ముందు అనుకున్న పేర్లేమిటో చూద్దామా...

* జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడుగా పూరి తెరకెక్కించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. ఫుల్‌ మాస్‌ కథాంశంతో వచ్చిన చిత్రానికి ముందుగా ‘కబ్జా’ అనే పేరు పెడదామనుకున్నారు.


* రామ్‌ చరణ్‌ని వెండి తెరకు పరిచయం చేస్తూ పూరి తీసిన చిత్రం ‘చిరుత’. కథనుగుణంగా ఈ సినిమాకు ‘కుర్రాడు’ టైటిల్, దాంతోపాటు ‘లో క్లాస్‌ ఏరియా’ అనే ట్యాగ్‌లైన్‌ అనుకున్నారట.

*రవితేజతో పూరి అందించిన ప్రేమ కథా చిత్రం ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’. ఈ సినిమాకు ‘జీవితం’ టైటిల్‌ పెడదామని భావించారు.


* పూరి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచే చిత్రాల్లో పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘బద్రి’ ఒకటి. ఈ సినిమాకు ‘చెలి’ అనే టైటిల్‌ అనుకుంటే క్లాస్‌గా ఉంటుందని ఆయన సన్నిహితులు చెప్పడంతో ఆ పేరు మార్చారు.

* మహేష్‌ బాబుతో పూరి తీసిన బ్లాక్‌ బ్లస్టర్‌ చిత్రం ‘పోకిరి’. కథానాయకుడి పాత్రకు తగినట్టుగా ఉంటుందని ముందుగా ఈ సినిమాకు ‘ఉత్తమ్‌ సింగ్‌’ పేరు పెట్టాలనుకున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.