మాటల్లేని ‘పుష్పక విమానం’ అలా పుట్టిందట!

పాటలు లేని సినిమాను ఊహించుకోవచ్చు కానీ అసలు మాటలే లేని సినిమాని ఊహించగలమా? ఈ ప్రశ్నకు సమాధానమం ఇచ్చిన చిత్రం ‘పుష్పక విమానం’. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌తో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సాహసించి తెరకెక్కించారు. సంభాషణలు లేని చిత్రంగా వచ్చి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఎలా తీశారు? అనే సందేహం సినిమా చూసిన, చూస్తున్న ప్రతి ఒక్కరికీ కలుగుతూనే ఉంటుంది. చిరస్థాయిగా నిలిచే చిత్రాల జాబితాలో ‘పుష్పక విమానం’ తర్వాతే వేరే సినిమా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో! ఇలాంటి వైవిధ్యభరిత చిత్రం తెరకెక్కించేందుకు దర్శకుని స్ఫూర్తి ఏంటో తెలుసా? అప్పట్లో సింగీతం, కె.వి.రెడ్డితో కలిసి పనిచేసేటప్పుడు ఓ జానపద చిత్రంలో పింగళి నాగేంద్రరావు ‘మిత్రమా. ఇక్కడంతా చీకటి, నాకెందుకో భయంగా ఉంది’ అనే డైలాగ్‌ రాశారట. దీంతో కె.వి.రెడ్డి నాగేంద్రరావుని రమ్మని చెప్పి ‘ఏంటండీ! రాత్రి వేళ చీకటిగా ఉంటుంది. భయంలేకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం డైలాగ్‌లా రాయాలా?’ అన్నారట. ‘అయ్యా! మీరెలాంటి నటుల్ని ఎంపిక చేస్తారో, ఏ కెమెరామెన్‌ను తీసుకుంటారో తెలీదు కదా. అందుకే ఆ డైలాగ్‌ రాయాల్సివచ్చిందన్నా’రట పింగళి నవ్వుతూ. ఆ సంఘటనే నన్ను ‘పుష్పక విమానం’ తీసేందుకు స్ఫూర్తినిచ్చిందని సింగీతం ఓ సందర్భంలో తెలిపారు. అలా కె.వి.రెడ్డి, పింగళి మాటలతో మాటల్లేని ‘పుష్పక విమానం’ ప్రేక్షకులకు కానుకగా ఇచ్చారు సింగీతం. ఈ టైటిల్‌ ఎందుకు పెట్టారంటే? ఊహల్లో విహరించే ఓ యువకుడి కథ ఇది. మరోవైపు పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరి ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఊహాలు కూడా ఒకటి మించి మరొకటి వస్తుంటాయి. అందుకే ఈ కథకు ‘పుష్పక విమానం’ సరిపోతుందని భావించారట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.