‘అన్నమయ్య’లో.. భక్తి - రక్తి అందుకేనట!!

తెలుగు చిత్రసీమలోనే కాదు రాఘవేంద్రరావు సినీ కెరీర్‌లోనూ ‘అన్నమయ్య’ చిత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అప్పటి వరకు రొమాంటిక్‌ హీరోగా మాత్రమే ప్రేక్షకుల తెలిసిన అక్కినేని నాగార్జునను భక్తి పాత్రలకు చిరునామాగా మార్చింది ఆయనే. అప్పట్లో నాగ్‌తో కలిసి దర్శకేంద్రుడు చేసిన ఈ ప్రయోగం ఓ పెద్ద సంచలనం. నిజానికి ఈ చిత్రాన్ని నాగ్‌తో అనుకున్నప్పుడు ఆయన అభిమానులు, సినీవర్గాలు సైతం ఓ లవర్‌బాయ్‌ లాంటి హీరోతో ఇలాంటి ఆధ్యాత్మిక చిత్రమేంటి అని పెదవి విరిచారు. ఈ చిత్రం విడుదలయ్యాక ఓ పది రోజుల పాటు థియేటర్లు వెలవెలబోయాయి. కానీ, ఆ తర్వాత నుంచి ‘అన్నమయ్య’ బాక్సాఫీస్‌ ముందు విశ్వరూపం చూపించింది. ముఖ్యంగా నాగ్‌ అభిమానులను మెప్పించడం కోసం దర్శకేంద్రుడు ఈ భక్తి చిత్రంలో రక్తిని మేళవించిన తీరు అమోఘం. అయితే ఇలా భక్తిలో రక్తిని ఎందుకు ఇరికించాల్సి వచ్చిందనే దానికి ఓ లాజిక్కు ఉందట. రాఘవేంద్రుడు ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘నిజానికి అన్నమయ్య రాసిన పాటల్లో ఎక్కువ శాతం శృంగార ప్రధానమైనవే ఉన్నాయట. ఈ విషయం ఆ వాటిని చదివితే కానీ ఎవరికీ తెలియదు. వీటన్నింటినీ ఆయనెంతో భక్తితో రాశారు. మేము ‘అన్నమయ్య’లో చాలా తక్కువ సన్నివేశాల్లోనే వీటిని చూపించాం. ఎవరైనా సరే రక్తిలో నుంచి భక్తిలోకి మారతారని చరిత్ర చెబుతోంది. నిజ జీవితంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. విద్యార్థిగా ఉన్నప్పుడు గుడికి వెళ్లమంటే ఎవరూ ఆసక్తి చూపించరు. అదే పిల్లలు, బాధ్యతలు పెరిగాక కష్టాలు రాకుండా చూడు స్వామి అని మొక్కుకునేందుకు కచ్చితంగా గుడికి వెళ్తారు’’. అంటూ తన లాజిక్కును వివరించారు రాఘవేంద్రరావు. నేటితో ఈ చిత్రం 23 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1997 మే 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.