ఆ కారణంతోనే చెర్రీ, శివ ప్రాజెక్టు ఆగిపోయింది

కొన్ని చిత్రాలు ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిపోతుంటాయి. ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇది సహజం. నూతన నటీనటులు, దర్శకుల విషయంలో అయితే అంతగా ఆసక్తి చూపని సినీ ప్రియులు అగ్ర కథానాయకులు, దర్శకుల కలయికలో సినిమా అని ప్రకటించినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఫాలో అవుతూనే ఉంటారు. ఇలాంటి చిత్రాలు నిలిచిపోతే ఎందుకా? అని చర్చలు పెడతారు. రామ్‌ చరణ్, కొరటాల శివ క్రేజీ ప్రాజెక్టు విషయంలో ఇదే జరిగింది. తొలి చిత్రం ‘మిర్చి’ తర్వాత శివ.. చెర్రీతో ఓ చిత్రం ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అప్పట్లో అది హాట్‌ టాపిక్‌. ఎందుకు ఆగిపోయింది? శివ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ శివకు స్క్రిప్ట్‌ విషయంలో నమ్మకం ఏర్పడటం లేదు. ఏదో చిన్న సందేహం. ఎన్నిసార్లు మార్పు చేసినా అనుకున్నట్లు రావట్లేదు. ఇస్తే బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ ఇవ్వాలి, అంతేకాని తొందరపడి సినిమా ప్రకటించామని ఏదో తీసేయడం బావుండదనుకున్నాడట శివ. ఇదే విషయాన్ని చెర్రీకి చెప్పగా.. ‘కథను తెరకెక్కించాల్సింది మీరే! నేను కేవలం మీరు చెప్పింది చేస్తాను. ఈ విషయంలో మీరే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీకు ఈ కథపై ఎప్పుడు నమ్మకం వస్తే అప్పుడే చిత్రీకరణ మొదలెడదాం’ అని స్నేహపూర్వకంగా సమాధానం ఇచ్చాడని ఓ సందర్భంలో స్పష్టత ఇచ్చాడు కొరటాల. ఈ ఇద్దరి కలయిలో చిత్రం భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి. కొరటాల తెరకెక్కిస్తున్న ‘చిరు 152’ చిత్రానికి రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.