రామయ్యా వస్తావయ్యా... హిందీలో అలాగే వచ్చెనయ్యా


హిందీ సినిమాలోని పాట తెలుగు పల్లవితో వినిపిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది? అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కపూర్‌ 1955లో నటించిన ‘శ్రీ 420’ చిత్రంలో ఈ విశేషం చోటుచేసుకుంది. అందులో ఓ పాట ‘రామయ్యా వస్తావయ్యా రామయ్యా వస్తావయ్యా... మైనే దిల్‌ తుఝ్‌కో దియా...’ అంటూ సాగుతుంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన శంకర్‌-జైకిషన్‌లలో ఒకరైన శంకర్‌ హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ఇక్కడున్న రోజుల్లో తెలుగువారు పాడుకునే ‘రామయ్యా వస్తావయ్యా..’ అనే జానపద గీతం ఆయనకు గుర్తుండిపోయింది. ‘శ్రీ 420’ చిత్రం పాటల గురించి రాజ్‌కపూర్‌తో చర్చిస్తున్న సమయంలో ఈ తెలుగు పదాలతోనే ఓ ట్యూను పాడి వినిపించాడట. ఆ సౌండింగ్‌ రాజ్‌కపూర్‌కు బాగా నచ్చడంతో వాటిని యథాతథంగా పెట్టమని చెప్పారట. అలా రూపొందిన ఆ పాట మంచి ఆదరణ పొందడంతో హిందీ ప్రేక్షకులకు రామయ్యా వస్తావయ్యా అనే పదాలు సుపరిచితమైపోయాయి. 2013లో ‘రామయ్యా వస్తావయ్యా’ టైటిల్‌తో ఓ బాలీవుడ్‌ సినిమా కూడా వచ్చింది. అన్నట్లు ‘అ అంటే అమలాపురం..’ పాటను ఓ హిందీ చిత్రంలో రీమిక్స్‌ చేసినప్పుడు తెలుగు పల్లవినే యథాతథంగా వాడారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.