
ఒక గొప్ప సినిమా, మంచి సినిమా, భారీ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ (1974). ఆ చిత్రం దర్శకుడు వి.రామచంద్రరావు. రామచంద్రరావు - డూండి కంపెనీలో సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఎక్కువగా వి.మధుసూదనరావు దగ్గర పనిచేశారు. ‘వీరాభీమన్యు’ సినిమా మొదలుపెడుతున్నప్పుడు, ముళ్లపూడి రమణ (ఆయన వాళ్లకి ‘రక్తసంబంధం’ రాశారు) నన్ను డూండికి పరిచయం చేశారు. ‘‘మంచి మిత్రుడు... మంచి నటుడు. ఏదో వేషం ఇవ్వండి’’ అన్నారు, డూండి ‘తప్పకుండా’ అని నా వివరాలు అడిగారు. ఆ సినిమాలోని ఒక ఘట్టంలో దేవేంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చే ఒక దృశ్యం వుంది. అది ఇచ్చారని తెలిసింది. రామచంద్రరావుని కలిసి, ఆ వేషం, షూటింగ్ తేదీ కనుక్కుని వెళ్ళిపోయాను. తర్వాత డూండి ‘‘రావి కొండలరావుకి ఏ వేషం ఇచ్చారు?’’ అని అడిగారట. ‘‘బ్రాహ్మణ వేషం’’ అని చెప్పారట. ‘అదా! అదేం కనిపిస్తుంది? ద్రోణాచార్యుల వేషం వుంది కదా, ఇంకా ఎవర్నీ అనుకోలేదు కదా. అదే ఇవ్వండి. ఆ తేదీలు చెప్పేయండి’’ అన్నారట ఆయన. అంతే! రామచంద్రరావు పరుగెత్తుకుంటూ (కారుమీదే అనుకోండి) మాయింటికొచ్చి ‘శుభవార్త’ చెప్పి, ముందు జరిగింది చెప్పారు. ‘‘ఇది మంచి వేషం, మంచి సంభాషణలున్నాయి. బాగా కనిపించే వేషం’’ అని, డేట్స్ రాసిన కాగితం ఇచ్చి నా ధన్యవాదాలు అందుకొని వెళ్లారు. చాలా ఆనందించాను.
రావి కొండలరావు