తొలి సినిమా ‘గుట్టు’ విప్పిన భానురేఖ (రేఖ)
అన్నపూర్ణా స్టూడియోలో 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి అక్కినేని ఇంటర్నేషనల్‌ అవార్డుల వేడుక జరిగింది. దివంగత నటి శ్రీదేవి, బాలీవుడ్‌ నటి రేఖ (భానురేఖ)లకు మెగాస్టార్‌ చిరంజీవి ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఆ సందర్భంగా అక్కినేని నాగార్జున రేఖను పరిచయం చేస్తూ ఆమె తొలిసారి నటించిన చిత్రం తెలుగులో బి.ఎన్‌.రెడ్డి నిర్మించిన ‘రంగులరాట్నం’ అని ప్రకటించగా, రేఖ కల్పించుకొని తను నటించిన తొలి చిత్రం తెలుగు సినిమాయే కానీ ‘రంగులరాట్నం’ కాదు, 1958లో తెలుగులో వచ్చిన ‘ఇంటిగుట్టు’అని సవరించింది. అప్పుడు తనకి ఏడాది వయసని, అందులో తన తల్లి పుష్పవల్లి గుమ్మడి భార్యగా నటించగా తను వారి కూతురుగా బాలనటిగా అందులో కనిపించానని తెలిపింది. ఆ సినిమా గుట్టు కాస్త విప్పితే....


1955లో సుబోద్‌ ముఖర్జీ దర్శకత్వంలో శశిధర్‌ ముఖర్జీ ‘మునీంజీ’ అనే చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు నాసిర్‌ హుసేన్‌ రచన చేసిన ఈ సినిమాలో దేవానంద్, నళిని జయవంత్, ప్రాణ్, అమీతా, నాజిర్‌ హుసేన్, నిరూపరాయ్‌ మొదలగువారు నటించారు. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కాగా 1958లో ఇదే చిత్రాన్ని ‘ఇంటిగుట్టు’ పేరుతో ఆకెళ్ళ అప్పయ్య శాస్త్రి తెలుగులో పునర్నిర్మించారు. హిందీ చిత్ర కథకు సమూలంగా మార్పులు చేసి సదాశివబ్రహ్మం కథకు కొత్తరూపునిచ్చి సంభాషణలు సమకూర్చగా మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటలు రాశారు. ఈ చిత్రం ద్వారా మంత్రెడ్డి సూర్య ప్రకాష్‌ (ఎంఎస్‌.ప్రకాష్‌) సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో ఎన్‌.టి.రామారావు, సావిత్రి హీరో హీరోయిన్లు కాగా ఇతర పాత్రలను రేలంగి, గుమ్మడి. ఆర్‌.నాగేశ్వరరావు, పుష్పవల్లి, రాజసులోచన, సూర్యకాంతం పోషించారు. వేదాంతం రాఘవయ్య స్కీన్ర్‌ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించారు. సినిమా హిట్టయింది. హిందీ సినిమా నుంచి సదాశివబ్రహ్మం కేవలం నాలుగు ముఖ్య పాత్రల్ని మాత్రమే తీసుకున్నారు. అవి దేవానంద్‌ (ఎన్‌.టి. రామారావు), నళిని జయవంత్‌ (సావిత్రి), ప్రాణ్‌ (ఆర్‌. నాగేశ్వరరావు), అమీత (రాజసులోచన) పోషించినవి. మిగతావి సదాశివబ్రహ్మం కల్పించినవే.
 

నిర్మాత ఆకెళ్ళ అప్పయ్య శాస్త్రి (ఎ.కె.శాస్త్రి) విశాఖపట్నంలో బాగా ధనవంతుడు. మంత్రెడ్డి సూర్య ప్రకాష్‌ (ఎం.ఎస్‌.ప్రకాష్‌) అతనికి మిత్రుడు. ప్రకాష్‌ కొంతకాలం బొంబాయిలో వుండి సంగీత దర్శకులవద్ద శిష్యరికంచేశాడు. అతని ప్రోద్బలంతో శాస్త్రి సినిమా తీసేందుకు ఉపక్రమించాడు. అలా సంగీతా ప్రొడక్షన్స్‌ సంస్థ వెలసింది. ఆ రోజుల్లో రామారావును ప్రేక్షకులు వివిధ మారువేషాల్లో చూసేందుకు ఉత్సుకత చూపేవారు. ఇందులో రామారావు పోలీసు అధికారిగా, వృద్ధ డ్రైవర్‌గా, జ్యోతిష్కుడుగా, మార్వాడీ సేటుగా నాలుగు మారువేషాల్లో కనిపిస్తారు. అతని అనుచరుడు రేలంగి కూడా కొన్ని మారువేషాల్లో కనిపిస్తారు. ఇందులో పుష్పవల్లి నటించడానికి... అందులోనూ భానురేఖ (రేఖ) బాలనటిగా తొలిసారి వెండితెర మీద కనిపించడానికి కొంత నేపథ్యముంది. మద్రాస్‌ త్యాగారాయనగర్‌లోని రామన్‌ వీధిలో పుష్పవల్లికి రెండంతస్తుల ఇల్లు వుండేది. జెమినీ గణేశన్‌తో తెగతెంపులు చేసుకొని తన ముగ్గురు పిల్లలు మాస్టర్‌ బాబ్జి, భానురేఖ, రాధతో కలిసి ఆ ఇంటి మొదటి అంతస్తులో వుంటూ, క్రింది అంతస్తును సంగీతా ప్రొడక్షన్స్‌ వారి ఆఫీసు కోసం అద్దెకు ఇచ్చింది. అయితే ‘ఇంటిగుట్టు’ సినిమాకు సంగీత దర్శకుడిగా పరిచయమైన నిర్మాత స్నేహితుడు ఎం.ఎస్‌.ప్రకాష్‌ పుష్పవల్లికి దగ్గరై నాలుగేళ్లు ఆమెతో సహజీవనం చేశాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. అదే సమయంలో జెమినీ గణేశన్‌ సావిత్రిని వివాహమాడారు. ప్రకాష్‌ పుష్పవల్లికి ‘ఇంటిగుట్టు’ చిత్రంలో గుమ్మడి భార్య పాత్రను ఇచ్చాడు. ఈ సినిమాకు చిన్నారి పాప అవసరం కావడంతో ఆ పాత్రను పుష్పవల్లి భానురేఖ (రేఖ) చేత పోషింపజేసింది. అలా రేఖ ‘ఇంటిగుట్టు’లో తొలుత నటించడం జరిగింది. ఇంకొక విశేషమేమిటంటే, ఈ చిత్ర నిర్మాణానికి చాలాకాలం పట్టింది. అందుకు కారణం హీరోయిన్‌ సావిత్రి గర్భవతి కావడం. తరువాత సినిమా త్వరగా పూర్తి చేయడానికి వాహినీ స్టూడియోలో ఏకంగా నాలుగు సెట్టింగులు వేయాల్సి వచ్చింది. ఈ సినిమా 31 అక్టోబరు 1958 న విడుదలై మంచి హిట్‌గా పేరుతెచ్చుకుంది. ఇంటిగుట్టు సినిమా తరవాత బాల నటిగా రేఖ నటించిన సినిమా వాహినీ వారి ‘రంగులరాట్నం’. అందులో రేఖ త్యాగరాజు కూతురుగా నటించింది. ఇదీ ‘ఇంటి’ గుట్టు నేపథ్యం.

ఆకెళ్ళ అప్పయ్య శాస్త్రి, ఎం.ఎస్‌. ప్రకాష్‌ కలిసి తరవాత ‘మామకు తగ్గ అల్లుడు’ (1960) నిర్మించి నష్టపోయారు. శాస్త్రి ప్రకాష్‌తో విడిపోయి శుభోదయ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద ‘వారసత్వం’ (1964) వంటి సినిమాలు రెండు నిర్మించినా అవి విజయవంతం కాలేదు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.