‘మే’ నెలతో మొదలైన అక్కినేని ప్రస్థానం


అది 1944వ సంవత్సరం మండువేసవి కాలం. ముదినేపల్లి ఎక్సెల్సియర్‌ డ్రమాటిక్‌ అసోసియేషన్‌ బృందం తెనాలి పట్టణంలో నాటకం ప్రదర్శించి గుడివాడ వెళ్లేందుకు ఉదయాన్నే మద్రాస్‌-పూరి ప్యాసింజర్‌ ఎక్కి బెజవాడ (విజయవాడ) రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ బృందానికి నాయకుడు దుక్కిపాటి మధుసూదనరావు, నాటక నిర్వాహకుడు కోడూరు అచ్చయ్య చౌదరి. బెజవాడ రైల్వే స్టేషన్‌లో మద్రాసు వెళ్లేందుకు గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య ప్లాట్‌ ఫారం మీద వెయిట్‌ చేస్తున్నారు. ఇంతలో పూరి ప్యాసింజర్‌లో ఒక అబ్బాయి కిటికీలోంచి చూస్తూ ఆయన కంటపడ్డారు. అతడే దుక్కిపాటి వారి నాటక సమాజంలో ఆడవేషాలు వేసే అక్కినేని నాగేశ్వరరావు. అప్పుడు బలరామయ్య ‘సీతారామ జననం’ సినిమా కోసం నటీనటుల ఎంపిక పనిలో వున్నారు. రాముడి వేషానికి ‘అక్కినేని’ అయితే బాగుంటుందనిపించి ‘సినిమాలలో నటిస్తావా’ అని అడిగారు. అంతకు ముందే బాలనటుడిగా ‘ధర్మపత్ని’ (1939)లో చిన్న వేషం కట్టిన అక్కినేనికి ‘రైతుబిడ్డ’, ‘తల్లిప్రేమ’ వంటి సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇస్తానని చెప్పి తప్పించుకున్న నిర్మాతల వ్యవహారశైలి నచ్చని అక్కినేని అన్నయ్య రామబ్రహ్మం మొదట ‘నో’ అని చెప్పినా, బలరామయ్య ఇచ్చిన భరోసాతో ‘సరే’ అన్నారు. మేకప్‌ మ్యాన్‌ మంగయ్యది కూడా గుడివాడే కావడంతో అక్కినేనికి చక్కగా మేకప్‌ చేసి బాల్యంలో రాముడు ఇలాగే ఉండేవాడు కాబోలు అనేలా తీర్చి దిద్దారు. అలా అక్కినేని 8మే నెల 1944న మైలాపూరులోని ప్రతిభా పిక్చర్స్‌ ఆఫీసులో అడుగిడి 68 ఏళ్ళపాటు తిరుగులేని నాయకుడిగా తెలుగు చలనచిత్రసీమను ఏలారు. అందుకే దేవుడంటే నమ్మని అక్కినేని ఘంటసాల బలరామయ్యనే దేవుడిగా రోజూ మనసులో నమస్కరించి ఏ కార్యక్రమానికైనా వెళ్లడం అలవాటు చేసుకున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.