దర్శకుడి పేరు మీదు ఊరు

గాంధీ నగర్‌, నెహ్రూ కాలనీ అంటూ ప్రముఖుల పేర్ల మీదుగా ఊర్లు, కాలనీలకు నామకరణం చేయడం కొత్త కాదు. అయితే ఓ సినిమా గౌరవార్థం ఆ చిత్ర దర్శకుడి పేరునే తమ ప్రాంతం పేరుగా పెట్టుకున్నారన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్‌గా స్థానం సంపాదించుకున్న చిత్రం ‘షోలే’. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, హేమమాలిని లాంటి హేమాహేమీలు నటించిన ఆ చిత్రం, అందులోని పాత్రలూ ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రతినాయక పాత్ర గబ్బర్‌ సింగ్‌ గురించి నేటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ చిత్రాన్ని బెంగళూరులోని రామ్‌నగరం అనే పట్టణం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అక్కడ భారీగా ఉండే గ్రానైట్‌ రాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి ఓ ప్రాంతాన్నే గబ్బర్‌ సింగ్‌ దాక్కుని ఉండే డెన్‌గా చిత్రంలో చూపించారు. చిత్రీకరణ సమయంలో ఆ ఊరి ప్రజలకు చిత్రబృందంతో మంచి అనుబంధమేర్పడింది. తమ ఊరిలో తెరకెక్కిన ఆ చిత్రం మరపురాని విజయం సాధించడంతో వారు మురిసిపోయారు. అప్పుడే ‘షోలే’కు గౌరవసూచకంగా ఆ చిత్ర దర్శకుడు రమేష్‌ సిప్పీ పేరుమీదుగా తమ ఊరిలోని ఓ ప్రాంతానికి సిప్పీ నగర్‌ అని పేరుపెట్టుకున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.